Begin typing your search above and press return to search.
కాంత దాసుడుగా... కమలం అభ్యర్థి!
By: Tupaki Desk | 6 Oct 2017 12:55 PM GMTరాజకీయాల్లో ఎత్తులు వేయడమే కాదు.. ఎదుటి వారికి ఓ కంటితో కనిపెడుతూ ఉండాలి. లేకపోతే.. చిక్కుల్లో చిక్కుకుని నానా తిప్పలూ పడడం ఖాయం. ఇప్పుడు ఇలాంటి తిప్పలే పడుతున్నాడు బీజేపీ అభ్యర్థి ఒకరు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఏం జరుగుతుందో ఈ ఘటన స్పష్టం చేసేసింది. విషయంలోకి వెళ్తే.. పంజాబ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. దీంతో అక్కడ బీజేపీ-కాంగ్రెస్ లు హోరా హోరీగా కామెంట్లతో కుమ్మేసుకోవడం సహా ఒకరి గాలి ఒకరు తీసేసుకుంటున్నారు.
నటుడు వినోద్ ఖన్నా మరణంతో ఖాళీ అయిన గురదాస్ పూర్ నియోజక వర్గంలో ఉపఎన్నికకు తెర లేచింది. దీనికి ముహూర్తం కూడా ఖరారై పోయింది. ఈ నెల 11 న అక్కడ ఉప పోరు జరగనుంది. దీనికిగాను కాంగ్రెస్ - బీజేపీలు హేమాహేమీలలాంటి నేతలకు బరిలోకి దింపాయి. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థిని ఎన్నికల కన్నా ముందే ఓడించేందుకు రెడీ అయింది. బీజేపీ అభ్యర్థిగా ఉన్న స్వరణ్ సలారియా చిక్కుల్లో ఇరుక్కుపోయారు. ఇప్పటికే ఓ మహిళ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్లు లైంగికంగా అనుభవించాడంటూ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును బీజేపీ నేతలు తోసిపుచ్చారు.
తాజాగా ఆ మహిళతో స్వరణ్ సలారియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. వెంటనే స్వరణ్ సలారియా నామినేషన్ రద్దు చేయాలని జాతీయ ఎలక్షన్ కమిషన్ను కోరింది. ఇప్పటికే ప్రచారం పూర్తి కావడం, అభ్యర్థిని నిలబెట్టడం వంటి క్రతువులు పూర్తయ్యాక.. మరో ఆరురోజుల్లో ఎన్నికలు ఉండగా ఇలా జరగడంతో బీజేపీ శ్రేణులు సహా అధిష్టానం కూడా కలవర పడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.