Begin typing your search above and press return to search.

మోడీ దత్తత తీసుకున్న ఊళ్లో కమలం వాడింది

By:  Tupaki Desk   |   3 Nov 2015 4:11 AM GMT
మోడీ దత్తత తీసుకున్న ఊళ్లో కమలం వాడింది
X
దేశ ప్రధానిగా.. తిరుగులేని నాయకుడిగా అవతరించిన నరేంద్ర మోడీకి కాలం కలిసి వస్తున్నట్లుగా లేదు. నిన్నమొన్నటి వరకూ తిరుగులేని నేతగా కనిపించిన ఆయనకు ఈ మధ్య ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు దేశంలో మత సహనం బాగా తగ్గిపోయిందన్న ఆందోళనలు.. మరోవైపు నేపాల్ తో సత్ సంబంధాలు కోరుకుంటే అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటం.. బీహార్ ఎన్నికల్లో సానుకూలత కనిపించకపోవటం లాంటి ఎన్నో ఇబ్బందుల్ని మోడీ ఎదుర్కొంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి.

మిగిలిన చోట్ల ఎలా ఉన్నా.. సొంత అడ్డాలో తన సత్తాను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అయితే.. అక్కడ అందుకు భిన్నంగా పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే.. ప్రధాని మోడీ దత్తత తీసుకున్న గ్రామంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం ఒక షాకింగ్ గా చెప్పొచ్చు. ప్రధాని దత్తత తీసుకున్న గ్రామంలో కమల వికాసం జరగకపోగా.. కమలం వాడిపోవటం మారుతున్న తాజా రాజకీయ పరిస్థితికి చిహ్నంగా చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని జయపురా గ్రామ పంచాయితీని ప్రధాని మోడీ దత్తత తీసుకున్నారు. ఈ గ్రామ పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓడిపోగా.. బీఎస్పీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించటం కమలనాథులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్వయంగా ప్రధాని దత్తత తీసుకున్న గ్రామంలోనే ఆయన నేతృత్వం వహిస్తున్న పార్టీని అభిమానించకపోవటం ఏమిటి..? ఈ ఎన్నికల ఫలితం ఆందోళనకర సంకేతాల్ని ఇస్తున్నట్లు లేదు..?