Begin typing your search above and press return to search.

తిరుపతిలో త్యాగం.. సీటు బీజేపీకే..పవన్ పై ఆగ్రహాజ్వాలలు?

By:  Tupaki Desk   |   12 March 2021 4:50 PM GMT
తిరుపతిలో త్యాగం.. సీటు బీజేపీకే..పవన్ పై ఆగ్రహాజ్వాలలు?
X
విశాఖ ఉక్కు మంటలు ఇంకా చల్లారనే లేదు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని మరోసారి ప్రకటించడంతో బీజేపీపై ఏపీ ప్రజలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తున్నారు. విశేషం ఏంటంటే విశాఖ ఉద్యమానికి ఏపీ నుంచే కాదు.. తెలంగాణ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు పలికారు. చిరంజీవి సైతం గళమెత్తారు. బీజేపీపై ఏపీ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ అంటేనే ఏపీ ప్రజలు మండిపడుతున్న వేళ అనూహ్యంగా తిరుపతి ఎంపీ సీటులో బీజేపీ పోటీచేస్తుందని తెలిపి మరో బ్లండర్ మిస్టేక్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గెలుపు అవకాశాలున్న జనసేనను కాదని.. బీజేపీని నిలపడమే పెద్ద తప్పు అని అంటున్నారు.

ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన సత్తాచాటింది. బీజేపీ తేలిపోగా.. జనసేన మెజార్టీ సీట్లు సాధించింది. ప్రతిపక్షం టీడీపీతో సమానంగా సీట్లు దక్కించుకుంది. బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఈ క్రమంలోనే తిరుపతి ఎంపీ సీటులో కనుక జనసేన పోటీచేస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుందని జనసేన నేతలంతా సమాయత్తమవుతున్న వేళ చావుకబురును బీజేపీ అధిష్టానం చల్లాగా చెప్పింది. తిరుపతిలో బీజేపీ పోటీచేస్తుందని స్పష్టతనిచ్చింది. అయితే దీనికి పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నాడని ఇప్పుడు ఆ పార్టీ నేతలు జీర్ణించుకోవడం లేదు. బలం లేని బీజేపీ బరిలో ఉండడంతో జనసేన నాయకులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

తాజాగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్నట్టు ఆ పార్టీ నేత మురళీధరన్ ట్వీట్ చేశారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని ప్రకటించారు. జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.తిరుపతి నుంచే బీజేపీ విజయయాత్ర మొదలవుతుందని తెలిపారు. బీజేపీ -జనసేన కలిసి వైసీపీ, టీడీపీల ముసుగును తొలగిస్తారని అన్నారు. దీంతో కొద్దినెలలుగా సాగుతున్న సందిగ్ధతకు తెరదించారు.

అయితే ప్రస్తుతం విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో బీజేపీపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పోటీచేస్తే ఫలితం వేరే ఉండేది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటిన జనసేనకు అంతో ఇంతో ఎడ్జ్ ఉండేది. కానీ బీజేపీకి సీటును త్యాగం చేసిన పవన్ తీరుపై జనసైనికులు, ప్రజల్లోనూ విస్మయం వ్యక్తం అవుతోంది.