Begin typing your search above and press return to search.

కులం స్కెచ్:బీజేపీ గూటికి 10 మంది ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   17 May 2018 8:46 AM GMT
కులం స్కెచ్:బీజేపీ గూటికి 10 మంది ఎమ్మెల్యేలు
X
కన్న‌డ రాజకీయం అనూహ్య మ‌లుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ మ‌రింత పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఊహించ‌ని ప‌రిణామాల మ‌ధ్య య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారంచేయ‌గా.. బల నిరూపణ కోసం 15 రోజుల సమయం గవర్నర్ ఇచ్చారు. నిజానికి యడ్యూరప్ప అడిగింది వారం రోజులే అయినా...గవర్నర్ 15 రోజులు ఇవ్వడంపైనా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలతో బేరసారాలు మొదలయ్యాయి. బీజేపీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది కుల స‌మీక‌ర‌ణాలు కావ‌డం గ‌మ‌నార్హం.

త‌మ పార్టీకి సీఎం పీఠం ద‌క్క‌డం కోసం బీజేపీ విభ‌జించి పాలించు అనే రాజ‌కీయాల‌ను పాటిస్తోంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్ర‌మంలో బీజేపీ చేతిలో ఉన్న ఆప్ష‌న్ల‌లో మొద‌టిది తమకు తక్కువగా ఉన్న 8 మంది ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ లేదా జేడీఎస్‌ ల వైపు చూడటం.. లేదంటే బల నిరూపణ సమయానికి ఆ రెండు పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు అసలు సభకు హాజరు కాకుండా చేయడం. రెండో దారిలో వెళ్తే సభలో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గి బీజేపీ ఇప్పుడున్న సంఖ్యతోనే బల నిరూపణ చేసుకోగలుగుతుంది. మొదటి దారిలో వెళ్లాలంటే మాత్రం కనీసం మరో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి అవసరమవుతారు. దీనికోసం కాంగ్రెస్‌ లోని లింగాయత్ ఎమ్మెల్యేల వైపు బీజేపీ చూస్తోంది. కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిలో పది మందికిపైగా లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్క‌డే కుల‌మ‌త స‌మీక‌ర‌ణాల‌ను బీజేపీ అమ‌ల్లో పెడుతోంది.

కాంగ్రెస్ పార్టీలోని అంత‌ర్గ‌త రాజకీయాల ఆధారంగా ఆ పార్టీ ఎమ్మెల్యేల‌ను చీల్చేందుకు బీజేపీ ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్లు స‌మాచారం. కర్ణాటకలో లింగాయత్‌ లు - వొక్కలిగాల మధ్య ఎన్నాళ్లుగానో రాజకీయ వైరం ఉంది. 2007లో ఒప్పందం ప్రకారం సీఎం పీఠాన్ని బీజేపీకి ఇవ్వాల్సిన కుమారస్వామి దానికి అంగీకరించకపోవడం వీళ్ల మధ్య వైరాన్ని మరింత ముదిరేలా చేసింది. ఇప్పుడిదే పాయింట్‌ ను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేల వేటలో బీజేపీ ఉంది. వొక్కలిగ అయిన కుమారస్వామి సీఎం కావడం లింగాయ‌త్‌ ల‌కు ఇష్టం లేదు. దీంతో లింగాయత్ కమ్యూనిటీలో పెద్ద నేతగా ఉన్న యడ్యూరప్ప వైపు వీళ్లు చూసే అవకాశం ఉంది. ఇక లింగాయత్‌ లకు ప్రత్యేక మతం - మైనార్టీ హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను కూడా వీళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వీళ్లంతా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మరి ఆ పార్టీ ఎంత వరకు సక్సెసవుతుందో చూడాలి మ‌రి.