Begin typing your search above and press return to search.

కేసీఆర్ మీద బీజేపీ బ్రహ్మాస్త్రం ఇదే..

By:  Tupaki Desk   |   6 Nov 2019 6:09 AM GMT
కేసీఆర్ మీద బీజేపీ బ్రహ్మాస్త్రం ఇదే..
X
తెలంగాణలో బలంగా ఉన్న కేసీఆర్ ను ఎలా దెబ్బకొట్టాలి? ఇప్పుడిదే కేంద్రంలోని బీజేపీ పెద్దలను తొలుస్తున్న ప్రశ్న. ఇప్పటికే గండర గండరరాలు అయిన తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసైను తెలంగాణ గవర్నర్ గా తీసుకొచ్చిన బీజేపీ కేసీఆర్ నెత్తిన కూర్చోబెట్టింది. ఇప్పటికే ఆమె తెలంగాణ సీఎంను ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇక ఆర్టీసీ సమ్మె వెనుక కూడా బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. అందుకే కేసీఆర్ ఈ సమ్మె విషయంలో ఉక్కుపాదం మోపుతున్నారు.

ఇక హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టి వచ్చే ఎన్నికల్లోగా తెలంగాణ లో బలపడాలని యోచించిన బీజేపీకి ఓటర్లు షాకిచ్చారు. కనీసం డిపాజిట్ కూడా ఇవ్వకుండా ఘోర ఓటమిని ఇచ్చారు. దీంతో బీజేపీ డిఫెన్స్ లో పడింది. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై తీవ్రంగా మధిస్తోందట..

తెలంగాణలో అధికారం ఆశతో కేంద్రహోంమంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేయని పని లేదు. ఈ మధ్యలే టీడీపీకి సపోర్టుగా తెలంగాణలో ప్రబలంగా ఉన్న ఆంధ్రజ్యోతి మీడియాను కూడా బీజేపీ వైపు టర్న్ చేశారు అమిత్ షా. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇటీవల ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశాక మోడీషాలను ఎలుగెత్తి చాటడంలో ఆ పత్రికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.. మొన్న సండే స్పెషల్ బుక్ లెట్ ను కూడా ‘సర్ధార్ షా’ అని పత్రిక మొత్తం అమిత్ షా ధీరత్వంతో నింపేశారంటే మీడియాను బీజేపీ ఎంతలా మేనేజ్ చేస్తోందని అర్థమవుతోంది. తెలంగాణలో అధికార యావతో బీజేపీ ఇలా మీడియాను, నేతలను, వివిధ ఆర్టీసీ సంఘాలు సహా అన్నింటిని కేసీఆర్ మీదకు ఎగదోస్తోందని అర్థమవుతోంది.

తాజాగా వీటన్నింటిని తట్టుకొని నిలబడుతున్న కేసీఆర్ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి బీజేపీ రెడీ అయ్యిందన్న చర్చ సాగుతోంది. అదే ‘హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని’. ఇప్పటికే బీజేపీ పెద్దలు దీనిపై సమాలోచనలు చేస్తున్న వేళ తాజాగా మహారాష్ట్ర మాజీ గవర్నర్, తలపండిన తెలంగాణ బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలని దీనిపై బీజేపీ ఆలోచిస్తోందని.. తెలంగాణ పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే అయిపోతుందని హాట్ కామెంట్ చేశారు.

తెలంగాణకు హైదరాబాదే ఆయువు పట్టు. హైదరాబాద్ లేని తెలంగాణ శూన్యం. ఇంత ఆర్థిక పటిష్టం, జీడీపీ ఉందంటే అది మెట్రో పాలిటన్ సిటీ అయిన హైదరాబాదే.. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం గనుక కేంద్రం చేస్తే అది కేసీఆర్ ను చావుదెబ్బ కొట్టినట్టే. హైదరాబాద్ లేని తెలంగాణ జిల్లాలు అప్పుల్లో కూరుకుపోతాయి. యూటీగా హైదరాబాద్ మారితే దీనిపై వచ్చే ఆదాయం మొత్తం కేంద్రానికే పోతుంది. తెలంగాణకు రూపాయి రాదు. కేసీఆర్ సంపన్న రాష్ట్ర కలను కూడా బీజేపీ చెదరగొడుతోందన్నట్టు. సో బీజేపీ వేస్తున్న ఈ ఎత్తులను ఉద్యమసేనాని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరి.