Begin typing your search above and press return to search.

మామ‌కు కోడ‌లితో చెక్ పెట్టిన బీజేపీ

By:  Tupaki Desk   |   6 Feb 2022 11:33 AM GMT
మామ‌కు కోడ‌లితో చెక్ పెట్టిన బీజేపీ
X
అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఎన్నో విచిత్రాలు క‌నిపిస్తున్నాయి. అధికారం కోసం అన్ని పార్టీలు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెక్ పెట్టేందుకు అవ‌స‌ర‌మైన అన్ని మార్గాల‌ను అన్వేషిస్తున్నాయి. ఆ క్ర‌మంలో సొంత కుటుంబ స‌భ్యుల‌తోనే ప్ర‌త్య‌ర్థికి అడ్డుక‌ట్ట వేసేందుకూ వెన‌క‌డ‌డం లేదు. ముఖ్యంగా బీజేపీ ఈ విష‌యంలో అన్ని పార్టీల కంటే ముందు వ‌రుస‌లో ఉంద‌నే అభిప్రాయాలున్నాయి. ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ములాయం సింగ్ కోడ‌లు అప‌ర్ణ‌ను త‌మ పార్టీలో చేర్చుకుని స‌మాజ్‌వాదీ పార్టీని బీజేపీ ఇబ్బందుల్లోకి నెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు గోవాలోనూ ఓ రాజ‌కీయ దిగ్గ‌జానికి ఇలాగే ఆ పార్టీ చెక్ పెట్టింది.

ప్ర‌తాప్ సింగ్ రాణే.. గోవాకు ఆరుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఆయ‌న‌. 83 ఏళ్ల ఈ రాజ‌కీయ భీష్ముడు 1972 నుంచి ఏకంగా 11 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా గెలిచారు. 50 ఏళ్ల‌పాటు నిరంత‌రాయంగా శాస‌న స‌భ్యుడిగా కొన‌సాగిన రికార్డు ఆయ‌న‌ది. అలాంటి రాజకీయ దురంద‌రుడు ఈ సారి మాత్రం ఎన్నిక‌ల‌కు దూర‌మ‌య్యాడు. అందుకు కార‌ణం క‌చ్చితంగా బీజేపీనే అని చెప్పాలి. ఆయ‌న కోడలు దేవియాను త‌మ పార్టీ నుంచి బీజేపీ మామపై పోటీకి నిల‌బెట్టింది. కానీ కోడ‌లిపై పోరుకు నో చెప్పిన ఆయ‌న త‌న అభ్య‌ర్థిత్వాన్ని ఉప‌సంహ‌రించుకున్నారు.

ఆరు సార్లు ముఖ్య‌మంత్రిగా, ఓ సారి శాస‌న‌స‌భాప‌తిగానూ వ్య‌వ‌హ‌రించిన రాణేకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల జీవితా కాల కేబినేట్ హోదా క‌ల్పించింది. ఈ సారి ఎన్నిక‌ల్లో పోరియం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపు లాంఛ‌న‌మేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ ఆయ‌న్ని త‌మ పార్టీలోకి ఆహ్వానించి భంగ‌ప‌డ్డ బీజేపీ ఇప్పుడు మ‌రో వ్యూహానికి తెర‌తీసింది. ఆయ‌న కుటుంబంలోనే కుంప‌టి రాజేసింది. కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలోకి వెళ్లిన రాణే కుమారుడు విశ్వ‌జిత్ రాణేకు బీజేపీ ప్ర‌భుత్వంలో ఆరోగ్య మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఇప్పుడిక ఆయ‌న స‌తీమ‌ణి, ప్ర‌తాప్ సింగ్ రాణే కోడ‌లిని బీజేపీ మామ‌పై పోటీకి నిల‌బెట్టింది. దీంతో పోరియం నుంచి పోటీ చేయాల్సిన ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు. ఇలా మొత్తానికి బీజేపీ అనుకున్న ఫ‌లితాన్ని రాబ‌ట్టింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.