Begin typing your search above and press return to search.

బండి తన దమ్మేంటో చూపించచ్చు కదా ?

By:  Tupaki Desk   |   14 Sep 2022 8:30 AM GMT
బండి తన దమ్మేంటో చూపించచ్చు కదా ?
X
సీఎం కేసీయార్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేయటం చాలా విచిత్రంగా ఉంది. బండి సంజయ్ డిమాండ్ చేస్తేనో లేకపోతే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తేనో కేసీయార్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారా ? దాదాపు 40 ఏళ్ళ రాజకీయంలో కేసీయార్ ఎన్ని డక్కా మొక్కీలు తినుంటారు ? బండి లాంటి వాళ్ళను ఎంతమందిని చూసుంటారు.

తాను డిమాండ్ చేస్తే కేసీయార్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోరని బండికి కూడా బాగా తెలుసు. అయినా ప్రభుత్వాన్ని రద్దు చేసుకోమని డిమాండ్ చేయటం అదో అలవాటుగా మారిపోయింది. నిజంగానే జనాల్లో కేసీయార్ పాలనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందనే అనుకుందాం. ఆ విషయం బండికి నిశ్చయంగా తెలిసినపుడు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉపఎన్నికను తేవచ్చు కదా.

మునుగోడులో కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చేట్లు చేస్తున్నారు కదా. ఇదే పద్దతిలో కరీంనగర్ ఎంపీగా తాను రాజీనామా చేసి వెంటనే ఉపఎన్నికను తెప్పించచ్చు.

వచ్చే ఉప ఎన్నికలో మళ్ళీ పోటీ చేసి గెలిచి కేసీయార్ పరిపాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని నిరూపించనట్లవుతుంది. గెలుస్తారో లేదో తెలీని రాజగోపాలరెడ్డే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చేట్లు చేస్తున్నారు. మరదే పద్దతిలో బండి కూడా ఎందుకు నడవకూడదు.

ప్రభుత్వాన్ని రద్దుచేసుకోమని కేసీయార్ ను పదే పదే డిమాండ్ చేసేబదులు తన ఎంపీ పదవికి రాజీనామా చేయటం బండి చేతిలో పనికదా. తన చేతిలో ఉన్న పనిని వదిలిపెట్టి అనవసరంగా కేసీయార్ కి ఛాలెంజులు చేయటం వల్ల జనాల్లో బండి పలుచనవ్వటం తప్ప మరో ఉపయోగమే ఉండదు. ప్రభుత్వాన్ని రద్దు చేసేంత దమ్ముందా అని కేసీయార్ ను అడిగేబదులు తన దమ్మేంటో బండి చూపితే బాగుంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.