Begin typing your search above and press return to search.

ఎన్నికలు తొందరగా వస్తే గోలొదిలి పోతుందా ?

By:  Tupaki Desk   |   8 Aug 2022 5:51 AM GMT
ఎన్నికలు తొందరగా వస్తే గోలొదిలి పోతుందా ?
X
తెలుగు రాష్ట్రాల్లో జనరల్ ఎలక్షన్స్ తొందరగా వచ్చేస్తే బాగుంటుంది. లేకపోతే బీజేపీ చీఫుల ప్రకటనలు వినటానికి చాలా కష్టంగా ఉంటోంది. రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేసేంత సీన్ లేదని అందరికీ తెలుసు. నిజానికి బీజేపీ చీఫులతో పాటు నేతలకు కూడా బాగా తెలుసు.

అయినా అధికారంలోకి వచ్చేస్తామంటు నానా గోల చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా దొరకని బీజేపీ కూడా అధికారంలోకి వచ్చేస్తామని రచ్చ చేస్తుండటమే విచిత్రంగా ఉంది.

ఇప్పుడిదంతా ఎందుకంటే ఏపీ చీఫ్ సోమువీర్రాజు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది మాత్రం బీజేపీనే అన్నారు. బీజేపీ యువమోర్చా చేపట్టిన ప్రజా సంఘర్షణ యాత్రకు జనాలు బ్రహ్మరథం పడుతున్నట్లు చెప్పారు.

టీడీపీకన్నా బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారమయ్యే వరకు తమ పోరాటాలు చేస్తునే ఉంటామని హెచ్చరించటం విచిత్రంగానే ఉంది. అసలు బీజేపీ చేస్తున్న పోరాటాలేమిటో ? టీడీపీకన్నా బీజేపీకే ఆదరణ పెరగటం ఏమిటో అర్ధం కావటంలేదు.

ఇక తెలంగాణాలో చూస్తే ఎన్నికలతో సంబంధంలేకుండానే బీజేపీ ప్రభుత్వం ఫాం చేసేస్తుందన్నట్లుగా ఉంటోంది చీఫ్ బండి సంజయ్ ప్రకటనలు. ప్రతిరోజు తొడకొట్టి కేసీయార్ ను చాలెంజులు చేయటం, జైలుకు పంపుతామని హెచ్చరించటాలు రచ్చ రచ్చ చేసేస్తున్నారు. తెలంగాణాలో బీజేపీ పరిస్ధితి ఏపీలో కన్నా మెరుగ్గా ఉందని మాత్రం చెప్పచ్చు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేస్తే 119 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు దొరకటం కష్టమే.

అందుకనే కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి ఎంఎల్ఏలు, సీనియర్ నేతలను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఏపీలో అయితే తమపార్టీలో చేరమని ఎంతగా బతిమాలినా ఎవరు చేరటంలేదు. ఎంతమంది చేరినా బీజేపీ గెలుపు కాదు కనీసం డిపాజిట్లు దక్కటం కూడా కష్టమే. అందుకనే ఎన్నికలు అర్జంటుగా వచ్చేస్తే వీళ్ళ గోల కనీసం కొంతకాలమైనా ఆగిపోతుంది.