Begin typing your search above and press return to search.

బండి సంజ‌య్ సీఎం కావాలి..బీజేపీ ముఖ్య‌నేత సంచ‌ల‌న డిమాండ్‌

By:  Tupaki Desk   |   26 April 2022 11:30 AM GMT
బండి సంజ‌య్ సీఎం కావాలి..బీజేపీ ముఖ్య‌నేత సంచ‌ల‌న డిమాండ్‌
X
ఓవైపు తెలంగాణ రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారుతుంటే మ‌రోవైపు రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీలో కొత్త సంచ‌ల‌నం తెర‌మీద‌కు వ‌చ్చింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా ఎద‌గాల‌ని ఆకాంక్షిస్తున్న బీజేపీలో ఆదిలోనే సీఎం సీటు ఎక్కేదెవ‌ర‌నే డిమాండ్ తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఇప్ప‌టికే బీజేపీలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ‌ర్గాలుగా పార్టీలో చీలిక వ‌చ్చిందని, దీనికితోడు దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు కూడా త‌న‌కు పార్టీలో ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం లేద‌ని అల‌క‌బూనిన ఎపిసోడ్ చ‌ర్చ‌నీయాంశం అవుతుంటే... బీజేపీ పార్టీ తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని, బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి అయితేనే రైతుల క‌ష్టాలు తీరుతాయ‌ని మాజీ ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర పాల‌మూరు జిల్లాలో సాగుతున్న స‌మ‌యంలో ఇవ్వాల మ‌క్త‌ల్‌లో జ‌రిగిన బ‌హిరంగ‌ స‌భ‌లో మాజీ ఎంపీ ఏపీ జితేంద‌ర్‌రెడ్డి ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మక్తల్ ప్రజలు బండి సంజయ్ కోసం ఎదురు చూశారని, కేసీఆర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలు గ్రహించారని తెలిపారు.

పాల‌మూరు రైతులు గోస‌ప‌డుతున్నార‌ని, అప్పుడెప్పుడో భీమా1, భీమా2 ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు చేప‌డితే ఇప్ప‌టికీ ఇంకా ప‌నులు పూర్తి కాలేద‌ని టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డ్డారు. అంతేకాకుండా పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌నులు చేప‌ట్టి చాలాకాల‌మైనా ఇప్ప‌టికీ ప‌నులు ముందుకు క‌ద‌ల‌డం లేదన్నారు. బండి సంజయ్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ పజల బతుకులు మారుతాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, ఇటీవ‌లే సీఎం ప‌ద‌విపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో టికెట్లు ఇచ్చే విధానంపై ఆ బండి సంజయ్‌ స్పష్టత ఇచ్చారు. పదవుల కోసం పనిచేసే వారికి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సంస్కృతి లేదని చెప్పారు.

ఎన్నికల్లో గెలిచాక తామే సీఎం అవుతామని ముందుగానే చెప్పుకునేవారు బీజేపీలో సీఎంలు కాలేరన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తనకు కూడా టికెట్‌ వస్తుందన్న నమ్మకం లేదన్నారు. కొందరు వ్యక్తిగత లబ్ధి కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇతరులకు టికెట్లు ఇప్పిస్తామని చెప్పినవారికే నాయకత్వం టికెట్లు ఇవ్వలేదన్నారు.