Begin typing your search above and press return to search.

బాబుకు మ‌రో షాక్‌..ఆఖ‌రు ఆశ‌లు కూడా గ‌ల్లంతే...

By:  Tupaki Desk   |   13 Oct 2019 9:00 AM GMT
బాబుకు మ‌రో షాక్‌..ఆఖ‌రు ఆశ‌లు కూడా గ‌ల్లంతే...
X
తాజా ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేనంత ఘోర ప‌రాజ‌యం మూట‌క‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలోనే అస‌లు టీడీపీకి భ‌విష్య‌త్తు ఉందా ? చ‌ంద్ర‌బాబు త‌ర్వాత ఆ పార్టీని న‌డిపించే నాథుడు ఎవ‌రు ? ఇప్ప‌టికే వ‌యొః భారంతో ఉన్న చంద్ర‌బాబు ఇక పార్టీని న‌డిపిస్తారా ? పార్టీ భ‌విష్య‌త్తుపై సొంత పార్టీ నేత‌ల‌తో పాటు కేడ‌ర్‌ లోనూ ఎందుకు స‌వాల‌క్ష సందేహాలు ఉన్నాయి... ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు ప్ర‌తి ఒక్క‌రి మ‌దిని త‌డుతున్నాయి.

ఇక అటు చంద్ర‌బాబుకు మ‌రోసారి ఎలాగైనా సీఎం అవ్వాల‌న్న కోరిక అయితే ఉంది. వార‌సుడు లోకేష్‌ ను నమ్ముకున్నా... నంద‌మూరి ఫ్యామిలీని కాద‌ని లోకేష్‌ ను ముందు పెట్టుకుని రాజ‌కీయం చేసినా టీడీపీ డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకునే ప‌రిస్థితి లేదు. ఇక రెండు రోజుల క్రితం బాబు కూడా తాను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పంతానికి పోయి త‌ప్పు చేశానని... అందుకే పార్టీ న‌ష్ట‌పోయింద‌ని చెపుతున్నారు. అదే టైంలో ప‌వ‌న్‌ తో సంబంధాలు చెడిపోకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే తాను గాజువాక‌లో ప్ర‌చారం చేయ‌లేద‌న్న విష‌యం కూడా విశాఖ‌లో బ‌య‌ట పెట్టారు.

బాబు వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే జ‌గ‌న్‌ ను ఢీ కొట్ట‌డం త‌న ఒక్క‌డి వ‌ల్ల కాద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ బీజేపీ - ప‌వ‌న్‌ కు ద‌గ్గ‌ర‌య్యేలా మాట్లాడుతున్నారు. ప‌వ‌న్ సంగ‌తి ఎలా ? ఉన్నా బీజేపీ మాత్రం మ‌ళ్లీ తాము బాబుతో జ‌త‌క‌ట్టే ప్ర‌శ‌క్తే లేద‌ని తేల్చేసింది. చంద్రబాబు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడే అమిత్ షా తాను ఉండ‌గా బాబును మ‌ళ్లీ ఎన్డీయే గ‌డ‌ప తొక్క‌నీయ‌న‌ని చెప్పేశారు. ఇక తాజాగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై బీజేపీ మ‌రోసారి త‌న బాబు వ్య‌తిరేక వైఖ‌రి స్ప‌ష్టం చేసింది.

ఎట్టిపరిస్థితుల్లోను టీడీపీ పార్టీతో బీజేపీ జత కట్టదని ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ ధియోధర తేల్చేశారు. రాబోయే స్థానిక సంస్థలో కూడా ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు ఆయన. అంతేకాదు వైసీపీ - జనసేన పార్టీలతోనూ పొత్తులుండవని చెప్పారు. బీజేపీకి.. టీడీపీకి శాశ్వ‌త ద్వారాలు మూసుకుపోయాయ‌ని చెప్పారు. టీడీపీకి అస‌లు లీడ‌రే లేరని.. ఆ పార్టీకి స‌రైన ద‌శ దిశ లేద‌ని..ఆ పార్టీలో ఉన్న వారికే త‌మ పార్టీపై ఆశ‌లు లేవ‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబుతో పాటు మ‌రికొంద‌రు నేత‌ల అవినీతి కార‌ణంగానే ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. టీడీపీ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుందని అన్నారు. ఏదేమైనా బాబుతో మ‌ళ్లీ జ‌ట్టుక‌ట్టేందుకు బీజేపీ ఎంత మాత్రం సిద్ధంగా లేదు. ఇక ప‌వ‌న్ ఏమంటాడో ? చూడాలి. మ‌రి ఈ నేప‌థ్యంలో బాబు ఒంట‌రి పోరుతో జ‌గ‌న్‌ను ఎంత వ‌ర‌కు ఎదుర్కొంటాడో..?