Begin typing your search above and press return to search.

బాబును టార్గెట్ చేస్తూ పురందీశ్వ‌రి కామెంట్‌

By:  Tupaki Desk   |   6 Jan 2018 1:58 PM GMT
బాబును టార్గెట్ చేస్తూ పురందీశ్వ‌రి కామెంట్‌
X

కేంద్ర రాష్ట్ర సంబంధాల‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌ - మాజీ కేంద్ర మంత్రి పురందీశ్వరి మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం గురించి స‌రైన విష‌యాలు వెల్ల‌డించడం లేద‌ని పున‌రుద్ఘాటించారు. పలాసలో బీజేపీ బూత్ కమిటీ మహా సమ్మేళనం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ ఇటు పార్టీ - అటు బీజేపీ సంబంధాల గురించి స్పందించారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పురందీశ్వ‌రి స్ప‌ష్టం చేశారు. పోల‌వ‌రం ప‌నుల్లో జాప్యం జ‌రుగుతోంద‌నే విష‌యం కేంద్ర ప్ర‌భుత్వం దృష్టిలో ఉంద‌న్నారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందనడం సరికాదని, పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న‌వి తప్పుడు లెక్కలు అని పురందీశ్వ‌రి త‌ప్పుప‌ట్టారు. ప్రతిపక్షమా.. మిత్రపక్షమా.. అనేది ముఖ్యం కాదని - సరైన లెక్కలు పంపితే తక్షణమే కేంద్రం నిధులు ఇస్తుందని ఆమె తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ ప్రతి నెల ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారని పురందీశ్వరి చెప్పారు.

రాష్ర్టానికి ఇచ్చిన హామీల‌పై కేంద్రం క‌ట్టుబ‌డి ఉందని, ఈ విష‌యంలో జ‌రుగుతున్న ప్ర‌చారం స‌రికాద‌ని పురందీశ్వ‌రి స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ తీరును త‌ప్పుప‌ట్టారు. మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్ర‌ ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లులో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని పురందీశ్వరి విమర్శించారు. బూత్ కమిటీ సభ్యులకు బీజేపీ లక్ష్యాలను నిర్దేశించిన పురందీశ్వ‌రి ఏ పార్టీతో పొత్తు లేకుండా 175 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను పోటీకి దింపుతామని స్పష్టం చేశారు. అంటే టీడీపీతో పొత్తు కొన‌సాగ‌దా అనే అంశంపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. టీడీపీతో పొత్తు విషయమై జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లడమే తమ బాధ్యత అని పురందీశ్వ‌రి అన్నారు.

ఇక ఉత్త‌రాంధ్ర‌కు కీల‌క‌మైన అంశ‌మైన విశాఖ రైల్వే జోన్ విష‌యంలో పురందీశ్వ‌రి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద‌ని ఆమెపున‌రుద్ఘాటించారు. ఒడిశావాసుల అభ్యర్థనతో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఆ రాష్ట్ర వాసులు అభ్యంత‌రం తెలిపి ఉండ‌క‌పోతే...ఇప్పటికే రైల్వే జోన్‌ మంజూరు అయ్యేదని వివ‌రించారు.