Begin typing your search above and press return to search.

ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌నంటున్న‌ బీజేపీ వివాదాస్ప‌ద ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   11 Oct 2022 6:30 AM GMT
ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌నంటున్న‌ బీజేపీ వివాదాస్ప‌ద ఎమ్మెల్యే!
X
ఎంఐఎం, టీఆర్ఎస్ దురాగ‌తాల‌పై అలుపెరుగ‌ని పోరాటం చేస్తూనే ఉంటాన‌ని బీజేపీ వివాదాస్ప‌ద ఎమ్మెల్యే రాజాసింగ్ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ త‌న‌కు ఇచ్చిన నోటీసుకు తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు.

రాజా సింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలోని గోషా మ‌హ‌ల్ కు బీజేపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ముస్లింల‌ను కించ‌ప‌రిచేలా సోష‌ల్ మీడియాలో వీడియో పోస్టు చేశార‌ని.. దీని ద్వారా విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించారంటూ ఆయ‌న‌ను పోలీసులు ఆగ‌స్టు 25న అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఆయ‌న‌పై పీడీ చ‌ట్టం కూడా న‌మోదు చేశారు. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు.

మ‌రోవైపు బీజేపీ ఆయ‌న‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఆ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ ఆగ‌స్టు 23న నోటీసు జారీ చేసింది. ప‌ది రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది.

అయితే రాజాసింగ్‌ జైల్లో ఉండ‌టంతో వివ‌ర‌ణ ఇవ్వ‌లేక‌పోయారు. సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని రాజా సింగ్ సతీమణి ఉషాబాయి బీజేపీ అధిష్టానానికి విన్న‌వించారు. ఈ నేప‌థ్యంలో రాజా సింగ్ తాజాగా బీజేపీ అధిష్టానానికి లేఖ రాసి తన వివరణను అందులో పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో ఆ నోటీసుకు వివ‌ర‌ణ ఇచ్చిన రాజాసింగ్ తాను ఏ మ‌తాన్ని కించ‌ప‌ర‌చలేద‌న్నారు. తానెక్క‌డా పార్టీ నిబంధ‌న‌లను కూడా ఉల్లంఘించ‌లేద‌ని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని క్రమశిక్షణ కమిటీకి తెలిపారు.

వివాదాస్పాద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షో సందర్భంగా తాను రిలీజ్ చేసిన వీడియోపై.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తప్పుడు కేసు పెట్టాయని రాజాసింగ్ ఆరోపించారు. ఆ కేసును కోర్టు డిస్మిస్ చేసిందని త‌న లేఖ‌లో గుర్తు చేశారు. మునావర్ ఫారుఖీని తాను ఇమిటేట్ మాత్రమే చేశానన్నారు. ఏ మతాన్ని, వ్యక్తిని కించపరచ‌లేదన్నారు.

ఎంఐఎం విధానాలను ప్రశ్నిస్తే ముస్లింలను తిడుతున్నట్లుగా వక్రీకరిస్తున్నారని రాజా సింగ్ త‌న లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తనపై 100కు పైగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. మునావర్ ఫారుఖీ షో రోజు తనతో పాటు ఐదు వందల మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని వివ‌రించారు.

తానెక్కడా బీజేపీ నిబంధనలను ఉల్లంఘించలేదని స్ప‌ష్టం చేశారు. పార్టీలో కొనసాగుతూ బీజేపీకి, దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని విన్న‌వించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.