Begin typing your search above and press return to search.

గుడివాడ బరిలో : నాన్న సీటులో చిన్నమ్మ పోటీ...?

By:  Tupaki Desk   |   22 Jun 2022 12:30 AM GMT
గుడివాడ బరిలో : నాన్న సీటులో చిన్నమ్మ పోటీ...?
X
ఏపీలో కొన్ని కీలకమైన స్థానాలు ఉన్నాయి. అక్కడ పోటీ ఆసక్తిగా ఉంటుంది. రాజకీయంగా రచ్చ కూడా వాటి మీద సాగుతుంది. ఇదిలా ఉంటే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో గుడివాడ సీటు చాలా ప్రత్యేకం. తెలుగు రాజకీయాలను ఒక మలుపు తిప్పిన అన్న నందమూరి తారకరామారావు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. పలు మార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా ఆయన తొలి గెలుపు రాజకీయ పిలుపు అన్నీ గుడివాడతోనే ముడిపడి ఉన్నాయి.

ఎన్టీయార్ అక్కడ సీటు వదిలేశాక ఆ కుటుంబ సభ్యులెవరూ పోటీకి దిగలేదు. టీడీపీలో ఇతర నాయకులే గెలిచారు. అలా టీడీపీ నుంచి గెలిచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన కొడాలి నాని వైసీపీ నుంచి మరో రెండు మార్లు గెలిచి మంత్రి కూడా అయ్యారు. కొడాలి నాని వైసీపీ నుంచి 2024లో మరోమారు వైసీపీ తరఫున పోటీకి సై అంటున్నారు.

ఈ నేపధ్యంలో ఆయన మీద పోటీకి సరైన క్యాండిడేట్ ని నిలపాలని టీడీపీ ఆలోచన చేస్తోంది. వంగవీటి రంగా కుమారుడు రాధాను నిలబెట్టాలని ఆ పార్టీ ప్లాన్ వేస్తోంది. ఇక ఇపుడు బీజేపీ నుంచి చూస్తే ఎన్టీయార్ రెండవ కుమార్తె. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని పోటీకి నిలబెడతారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

పురంధేశ్వరి మీద తాజాగా కొడాలి నాని చేసిన కొన్ని కామెంట్స్ వెనక ఆమె పోటీ చేస్తారన్న కచ్చితమైన సమాచారం ఉందనే అంటున్నారు. గుడివాడలో రైల్వే గేట్ల మీద ఫ్లై ఓవర్లను పురంధేశ్వరి అడ్డుకుంటున్నారు అని కొడాలి నాని ఆరోపించారు. అలా చేయడం వల్ల గుడివాడ అభివృద్ధి కుంటుపడుతుందని, పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని స్ట్రాంగ్ కౌంటరే ఆయన ఇచ్చారు.

ఒకవేళ అలా చేస్తే కనుక గుడివాడ నుంచి వెళ్ళే రైళ్ళను ఆపేయిస్తామని కూడా ఆయన సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా పైకి కనిపిస్తున్న వ్యవహారం అయినప్పటికీ అసలు విషయం చూస్తే గుడివాడ మీద చిన్నమ్మ కన్ను పడింది అన్న సమాచారం పక్కాగా ఉండడంతోనే నాని ముందస్తు జాగ్రత్తగా ఆమె మీద ఈ హాట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు.

అయితే కొడాలి నాని కామెంట్స్ మీద పురంధేశ్వరి మాట్లాడకపోయినా ఎన్టీయార్ అభిమానులు మాత్రం నానిని తప్పుపడుతున్నారు అంటున్నారు. కేవలం ఎన్టీయార్ చలువతోనే నాని రాజకీయంగా ఎమ్మెల్యే అయ్యారని, అది గుర్తు చేసుకుని ఎన్టీయార్ ఫ్యామిలీ మీద మాట్లాడే ముందు ఆలోచించాలని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఒక వైపు వంగవీటి రాధా, మరో వైపు పురంధేశ్వరి పోటీకి దిగిగే మాత్రం గుడివాడలో నాని గెలుపు అంత సులువు కాదు అనే అంటున్నారు. ఇక పురంధేశ్వరి పోటీ చేస్తే కనుక ఉమ్మడి క్రిష్ణా జిల్లాల మీద ఆ ప్రభావం గట్టిగానే ఉంటుంది అని కూడా వైసీపీలో కొత్త ఆందోళన బయల్దేరింది అని అంటున్నారు. చూడాలి మరి.