Begin typing your search above and press return to search.

రిజ‌ల్ట్స్ కు ముందే మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో షా మొద‌లెట్టేశారోచ్‌!

By:  Tupaki Desk   |   20 May 2019 10:52 AM GMT
రిజ‌ల్ట్స్ కు ముందే మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో షా మొద‌లెట్టేశారోచ్‌!
X
మే 23 ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత ప‌శ్చిమ‌బెంగాల్ లో మ‌మ‌త సర్కారుకు మూడుతుంద‌న్న విష‌యాన్ని కాస్తంత ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చేసిన ప్ర‌ధాని మోడీ మాట‌లు ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా సంచ‌ల‌నం సృష్టించాయి. తృణ‌మూల్ కాంగ్రెస్ కు చెందిన 40-50 మంది ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్న‌ట్లు చెప్పిన మోడీ మాట‌లు భారీ ఎత్తున సంచ‌ల‌నంగా మారాయి.

మోడీ కానీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. ప‌శ్చిమ‌బెంగాల్ తోపాటు క‌ర్ణాట‌క మ‌రికొన్ని రాష్ట్రాల‌కు మూడిన‌ట్లే అన్న వాద‌న వినిపించింది. దీనికి బ‌లం చేకూరేలా తాజా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం వెల్ల‌డైన ఎగ్జిట్ ఫ‌లితాల‌తో మోడీ మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి చేప‌డ‌తార‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చిన నేప‌థ్యంలో ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది.

తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ కు బీజేపీ ఒక లేఖ రాసింది. కాంగ్రెస్ సీఎం క‌మ‌ల్ నాథ్ నేతృత్వంలోని మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కారు బ‌లం నిరూపించుకునేలా వెంట‌నే ప్ర‌త్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వ‌హించాల‌ని బీజేపీ డిమాండ్ చేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. వెంట‌నే అసెంబ్లీని స‌మావేశ‌ప‌ర్చాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను తాము కోరుతున్న‌ట్లుగా ఒక లేఖను బీజేపీ రాసింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌నంత‌ట తానే కూలిపోతుంద‌ని.. ఎమ్మెల్యేల‌తో బేర‌సారాలు న‌డ‌ప‌టం త‌న‌కు న‌మ్మ‌కం లేద‌న్న ఆయ‌న‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ‌ద్దె దిగే స‌మ‌యం వ‌చ్చింద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ నేత గోపాల్ భార్గ‌వ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఈ మ‌ధ్య‌నే మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టం.. స్వ‌ల్ప అధిక్య‌త‌తో కాంగ్రెస్ పార్టీ క‌మ‌ల్ నాథ్ నేతృత్వంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం అసెంబ్లీలో 230 స్థానాల‌కు కాంగ్రెస్‌కు 113 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు ఎస్పీ.. బీఎస్పీ త‌దిత‌ర పార్టీలకు క‌లిపి కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంది.

ఇక‌.. బీజేపీకి 109 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంది. మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్లుగా ఉన్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 116 మంది ఎమ్మెల్యేల బ‌లం అవ‌స‌రం కాగా.. తాజాగా జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున బీజేపీ సీట్లు సొంతం చేసుకుంటుంద‌న్న అంచ‌నాతో.. బీజేపీ తాజా లేఖ రాసిన‌ట్లుగా భావిస్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు క‌మ‌ల్ నాథ్ స‌ర్కారుకు ముప్పు లేకున్నా.. బీజేపీ కానీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లెడితే మాత్రం..కాంగ్రెస్ స‌ర్కారుకు కాలం చెల్లిన‌ట్లేన‌ని చెప్పాలి.సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే.. స్వ‌ల్ప అధిక్య‌త‌తో ఉన్న ప్ర‌భుత్వాల్ని త‌మ హ‌స్తగ‌తం చేసుకునే దిశ‌గా మోడీ స‌ర్కార్ పావులు క‌దుపుతుంద‌న్న అభిప్రాయం ఉంది. ఇందులో భాగంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి బీజేపీ మొద‌లెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. బీజేపీ నేత‌లు రాసి లేఖ‌పై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.