Begin typing your search above and press return to search.

హుజూర్‌ న‌గ‌ర్ రేసులో వెన‌క‌ప‌డిన పార్టీ ఏదంటే..!

By:  Tupaki Desk   |   27 Sep 2019 8:05 AM GMT
హుజూర్‌ న‌గ‌ర్ రేసులో వెన‌క‌ప‌డిన పార్టీ ఏదంటే..!
X
హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌ధాన పార్టీల‌న్నింటికీ ఈ ఉప ఎన్నిక అగ్ని ప‌రీక్ష‌గా మారింది. అధికార టీఆర్ ఎస్‌ - కాంగ్రెస్ తోపాటు బీజేపీ ఈ ఎన్నిక‌ను అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయి. ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో పార్టీల‌న్నీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. హుజూర్‌ న‌గ‌ర్‌ లో గులాబీ జెండా ఎగ‌ర‌వేయ‌డం ద్వారా ప్రజామోదం తమ‌కే ఉంద‌ని చె ప్పుకోవ‌డంతోపాటు, త‌మ పాల‌న‌పై విప‌క్షాల ఆరోప‌ణ‌ల‌న్నింటికీ చెక్ పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.

అంద‌రికంటే ముందే త‌మ పార్టీ అభ్య‌ర్థిగా సైదిరెడ్డిని ప్ర‌క‌టించి - ప్ర‌చారంలో దూసుకుపోతోంది టీఆర్ ఎస్‌. మ‌రో వైపు సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకోవ‌డం ద్వారా టీఆర్ ఎస్‌ కు తామే ప్ర‌త్యాయ్నాయం అనే సంకేతాలివ్వ‌డంతోపాటు , రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌నుకుంటున్న బీజేపీని వెన‌క్కి నెట్టాల‌ని కాంగ్రెస్ భావిస్తోం ది. ఈ క్ర‌మంలోనే ఆటు టీఆర్ ఎస్‌ - ఇటు కాంగ్రెస్ పార్టీలు ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం హుజూర్ న‌గ‌ర్ పోరులో వెన‌క‌బ‌డింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

శ్రీకాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వాల‌ని తొలుత‌ బీజేపీ నేత‌లు భావించారు. బీజేపీ అభ్య‌ర్థిగా శంక‌ర‌మ్మ పేరు ఖ‌రారైంద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే క‌మ‌ల‌నాథుల ఆఫ‌ర్‌ ను శంక‌ర‌మ్మ తిర‌స్క‌రించారు. తాను టీఆర్ ఎస్‌ లోనే కొన‌సాగుతానని స్ప‌ష్టం చేశారు. దీంతో అభ్య‌ర్థి ఎంపికై మ‌ల్ల‌గుల్లాలు ప‌డిన నేత‌లు హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా శ్రీక‌ళారెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని పరిశీలించారు. అయితే ఏమైందో ఏమో తెలియ‌దు గానీ శ్రీక‌ళారెడ్డిని పోటీకి దింపే విష‌యంలో బీజేపీ వెన‌క్కిత‌గ్గిన‌ట్లే తెలుస్తోంది. తాజాగా మ‌రో ఇద్ద‌రి పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.

డాక్ట‌ర్ రామారావు - జైపాల్‌ రెడ్డిలో ఎవ‌రో ఒక‌రిని పోటీకి దింపాల‌ని పార్టీ యోచిస్తోంది. అయితే డాక్ట‌ర్ రామారావు పేరు దాదాపు ఖ‌రారైంద‌ని - నేడో రేపో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఓ ప‌క్క ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ ఎస్ - కాంగ్రెస్ లు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్రచారంలో దూసుకుపోతుంటే, బీజేపీ మాత్రం ఇంకా అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప డుతుండ‌టం క్యాడ‌ర్‌కు మింగుడుప‌డ‌టంలేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తే, ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించ‌డం అటుంచి, క‌నీసం గ‌తంలో మాదిరిగా నోటాకు వ‌చ్చిన ఓట్ల‌యినా ఆ పార్టీ సాధిస్తుందో లేదో అని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.