Begin typing your search above and press return to search.

మ‌రో రాష్ట్రంలో క‌మ‌లం పార్టీకి గ‌డ్డు ప‌రిస్థితులేనా!

By:  Tupaki Desk   |   1 Jan 2020 1:30 AM GMT
మ‌రో రాష్ట్రంలో క‌మ‌లం పార్టీకి గ‌డ్డు ప‌రిస్థితులేనా!
X
ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ‌ర‌స ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి, త‌గులుతూ ఉన్నాయి. లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చారిత్ర‌క విజ‌యం సాధించినా.. రాష్ట్రాల వారీగా ఎదుర‌వుతున్న తిర‌స్క‌ర‌ణ‌లు భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇబ్బందిక‌రంగా మారాయి. ఇలాంటి నేప‌థ్యంలో రానున్న రోజుల్లో బీజేపీ మ‌రింత క‌ఠిన ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. అందులో ఒక దానికి ఇప్ప‌టికే రంగం సిద్ధం అవుతూ ఉంది. ఇప్ప‌టికే అక్క‌డి రాజ‌కీయం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదే బీహార్ రాజ‌కీయం.

ప్ర‌స్తుతం భార‌తీ జ‌న‌తా పార్టీ బీహార్ లో పాల‌క ప‌క్షంగా ఉంది. అయితే అదేమీ ప్ర‌జ‌లు ఎన్నుకుంటే ఇచ్చిన‌ది కాదు. క్రితం సారి అక్క‌డ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో.. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూలు క‌లిసి ప‌ని చేశాయి. ఆ కూట‌మి అధికారాన్ని సొంతం చేసుకుంది. వాటికి వ్య‌తిరేకంగా వెళ్లి బీజేపీ చిత్తు అయ్యింది. మోడీ స్వ‌యంగా చాలా ప్ర‌చారం చేసినా అప్పుడు బీజేపీ నెగ్గ‌లేదు. అయితే ఆ కూట‌మి ప్ర‌భుత్వాన్ని బీజేపీ దెబ్బ‌తీసింది.

జేడీయూను త‌న వైపుకు తిప్పుకుని.. బీజేపీ అధికార ప‌క్షం అయిపోయింది. ఆర్జేడీ, కాంగ్రెస్ ల‌ను ప్ర‌తిప‌క్షంలోకి నెట్టింది. ఇలాంటి నేప‌థ్యంలో మ‌రో ఏడెనిమిది నెల‌ల్లో అక్క‌డ ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఇప్ప‌టికే జేడీయూ బీజేపీ విష‌యంలో క‌ఠినంగా మాట్లాడుతూ ఉంది. బిహార్ వ‌ర‌కూ త‌నే పెద్ద‌న్న అని జేడీయూ అంటోంది.

కేంద్రంలో కేబినెట్ ఏర్పాటు విష‌యంలో జేడీయూను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు మోడీ. దాంతో అప్పుడే జేడీయూ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఇక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే సీట్ల విష‌యంలో ఇప్ప‌టికే జేడీయూ నేత ప్ర‌శాంత్ కిషోర్ స్పందించారు. 50్‌-50 ఫార్ములా ఏదీ లేద‌ని.. తామే ఎక్కువ సీట్ల‌లో పోటీ చేస్తామ‌ని, బీజేపీ తాము కేటాయించే సీట్లలోనే పోటీ చేయాల‌న్న‌ట్టుగా పీకే ప్ర‌క‌టించారు.

అలాగే బీజేపీ ప్ర‌తిపాదిస్తున్న ఎన్ ఆర్సీని కూడా త‌మ రాష్ట్రంలో అమ‌లు చేసే ప్ర‌స‌క్తి లేద‌ని.. నితీష్ కుమార్ - ప్ర‌శాంత్ కిషోర్ లు ప్ర‌క‌టించారు. ఇలా క‌మ‌లం పార్టీని కంగుతినిపించే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు జేడీయూ నేత‌లు. జేడీయూను కూడా కాద‌నుకుని బీజేపీ సొంతంగా ఎన్నిక‌ల‌కు వెళ్లేంత సీన్ అక్క‌డ లేదు. మిత్ర‌ప‌క్షం లేక‌పోతే తామేం సాధించ‌లేమ‌ని ఇప్ప‌టికే బీజేపీ వాళ్లు నిరూపించుకున్నారు. ఇలాంటి నేఫ‌థ్యంలో నితీష్ కుమార్ ను వారు పూర్తిగా ప‌క్క‌న పెట్ట‌లేరు. అయితే బీజేపీ ముఖ్య‌నేత‌లు ఎవ‌రూ ఇంకా బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి మాట్లాడ‌లేదు. ప్ర‌స్తుతానికి అయితే వాళ్లు మౌనాన్నే ఆశ్ర‌యించిన‌ట్టున్నారు.