Begin typing your search above and press return to search.
త్రిపురలో బీజేపీ మహామాయ
By: Tupaki Desk | 3 March 2018 7:28 AM GMTఅయిదేళ్ల కిందట... 2013లో అక్కడి ఎన్నికల్లో 50 సీట్లలో పోటీ చేసిన పార్టీ 49 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. పాతికేళ్లుగా అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి ఎదురు నిలవలేకపోయింది. కానీ, చేతులెత్తేయలేదు... అవకాశాల కోసం కంటిన్యూగా ప్రయత్నం చేసింది. కట్ చేస్తే ఇప్పుడు తిరుగులేని విజయంతో అధికారం అందుకోబోతోంది. ఈసరికే అర్థమై ఉంటుంది ఇదంతా త్రిపురలో బీజేపీ విజయం గురించేనని.
తాజా సమాచారం ప్రకారం త్రిపురలో 33 స్థానాల్లో గెలిచింది. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 31 స్థానాలు సాధిస్తే అధికారం దక్కుతుంది. దాని ప్రకారం త్రిపుర కమ్యూనిస్టుల చేతి నుంచి బీజేపీ చేతికి అందినట్లే. అంతేకాదు... ఒక్క కేరళలో తప్ప కమ్యూనిస్టులు ఇప్పుడెక్కడా అధికారంలో లేనట్లయింది.
2013 ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ కేవలం1.59 శాతం ఓట్ షేర్ మాత్రమే సాధించింది. కానీ.. ఇప్పుడు బీజేపీ ఓట్ షేర్ 40కిపైగా ఉంది. త్రిపురలో కమ్యూనిస్టులు 1993 నుంచి అధికారంలో ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ 20 సంవత్సారాలుగా అక్కడ ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నారు. సౌమ్యుడిగా, అవినీతి రహితుడిగా, నిరాడంబురిడిగా ఆయనకు దేశవ్యాప్తంగా పేరుంది. అయినా, బీజేపీ మాత్రం అయిదేళ్లలో ఆయన అనుకూలతలన్నిటినీ దాటేసి ఆ రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంది.