Begin typing your search above and press return to search.

కాపులకు కమలం వల

By:  Tupaki Desk   |   21 Sep 2015 5:30 PM GMT
కాపులకు కమలం వల
X
నవ్యాంధ్రలో ప్రాబల్య వర్గంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి బీజేపీ పెద్దపీట వేస్తోంది. రాబోయే 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు పదవులు కట్టబెడుతోంది.

నవ్యాంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎంపికయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. ఆర్ ఎస్ ఎస్ అగ్రనేతలతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికితోడు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. నవ్యాంధ్రలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 18 శాతం వరకు ఉన్నాయి. ఈ సామాజిక వర్గం తలచుకుంటే గుండుగుత్తగా ఓట్లు పడిపోయే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో జరిగింది కూడా ఇదే. ఈ సామాజిక వర్గాన్ని దువ్వే పనిలో జగన్ ఉంటే.. వారి కోర్కెలను తీరుస్తున్న సమయంలో టీడీపీ - బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసి జగన్ ఆశలపై పూర్తిస్థాయిలో నీళ్లు చల్లాడు. దీనికితోడు గతంలో వాజపేయి హయాంలో కూడా కాపులు - రాజులు బీజేపీకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓట్లను గుండుగుత్తగా సాధిస్తే మిగిలిన ఓట్లను వ్యూహాత్మకంగా సాధించవచ్చనేది బీజేపీ అంచనాగా చెబుతున్నారు. అందుకే అద్యక్షుడిగా ఆ వర్గానికి చెందిన సోము వీర్రాజు ఆయన కాదంటే మంత్రి మాణిక్యాలరావును ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక్కడ సోము వీర్రాజు అయితే పవన్ కల్యాణ్ కు - ఆర్ ఎస్ ఎస్ కు - బీజేపీకి కూడా సమ్మతమేనని వివరిస్తున్నారు.