Begin typing your search above and press return to search.

బీజేపీ ఈ అస్త్రంతో ఆ రాష్ట్రాల ఎన్నికలను నెగ్గేస్తుందా!

By:  Tupaki Desk   |   16 Oct 2019 1:30 AM GMT
బీజేపీ ఈ అస్త్రంతో ఆ రాష్ట్రాల ఎన్నికలను  నెగ్గేస్తుందా!
X
హర్యానా - మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీకి అస్త్రం దొరికేసినట్టుగా ఉంది. అదే జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ త్రీ సెవెన్టీ రద్దు. కొన్ని నెలల కిందట బీజేపీ వాళ్లు ఆ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ దశాబ్దాలుగా ఆ డిమాండ్ చేస్తూ వచ్చింది. తమకు అధికారం దక్కిన తొలి ఐదేళ్లలో కూడా ఆ పని చేయలేదు. అయితే ఇప్పుడు తిరుగులేని బలం ఉండటంతో ఆ ఆర్టికల్ ను రద్దు చేసేశారు.

అయితే రద్దు అయితే చేశారు కానీ - జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటి వరకూ పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదని స్పష్టం అవుతోంది. అక్కడ బీజేపీయేతర పార్టీల నేతలను ఇంకా హౌస్ అరెస్టులో ఉంచారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే కమలం పార్టీ వాళ్లు మాత్రం అక్కడ అంతా ప్రశాంతంగా ఉందని ప్రకటిస్తున్నారు.

ఢిల్లీ నుంచి రాజకీయ నేతలను కూడా కశ్మీర్ లో అడుగుపెట్టనివ్వడం లేదు. అయినా అంతా ఓకే అని బీజేపీ వాళ్లు అంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో మోడీ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. తాము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. జమ్మూ కశ్మీర్ అంశాన్ని హర్యానా ఎన్నికల్లో మోడీ ప్రస్తావిస్తూ ఉండటం గమనార్హం.

అలా ఎందుకు చేస్తున్నారనేది స్పష్టం అవుతున్న అంశమే. ఎన్నికల్లో లబ్ధి కోసమే మోడీ ఆ పని చేస్తూ ఉన్నారు. ఆర్టికల్ త్రీ సెవెన్టీ రద్దును ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. ఆ ఆర్టికల్ రద్దు అప్పుడే చాలా మంది జనాలు దేశభక్తితో ఉప్పొంగిపోయారు. రెండు నెలల తర్వాత వారు ఆ విషయాన్ని మరిచిపోయి ఉండవచ్చు.

కశ్మీర్ ఇంకా పరిస్థితుల్లోకి రాలేదని అక్కడి వారు అంటున్నారు. అక్కడ అసెంబ్లీ లేదు. ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడప్పుడే అది జరిగేలా కూడా లేదు. లఢక్ నుంచి మాత్రం చాలా సానుకూల స్పందన వచ్చింది. కశ్మీర్ లో రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కశ్మీర్ సంగతెలా ఉన్నా.. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి మాత్రం ఆ అంశం బాగా ఉపయోగపడుతున్నట్టుగా ఉంది కమలం పార్టీకి!