Begin typing your search above and press return to search.

హుజూర్‌ న‌గ‌ర్ బీజేపీ అభ్య‌ర్థి... ఊహించ‌ని ట్విస్ట్‌..!

By:  Tupaki Desk   |   5 Sep 2019 6:58 AM GMT
హుజూర్‌ న‌గ‌ర్ బీజేపీ అభ్య‌ర్థి... ఊహించ‌ని ట్విస్ట్‌..!
X
తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. డిసెంబ‌ర్‌ లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ఇక్క‌డ విజ‌యం సాధించారు. మే నెల‌లో జ‌రిగిన లోక్‌ సభ ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌ల్ల‌గొండ నుంచి లోక్‌ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. దీంతో ఆయ‌న ఈ స్థానానికి రిజైన్ చేయ‌గా త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఉప ఎన్నిక‌ను అటు అధికార టీఆర్ ఎస్‌ తో పాటు - కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావ‌డంతో ఇద్ద‌రు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

ఇక బీజేపీ సైతం ఈ సీటును ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. డిసెంబ‌ర్‌ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 7 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఇక ఇక్క‌డ ఉప ఎన్నిక‌ను అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగానే తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి ఉత్త‌మ్ స‌తీమ‌ణి - కోదాడ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి పేరు వినిపిస్తోంది.

ఇక టీఆర్ ఎస్ అన్ని విధాలా బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు రెడీగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన సైదిరెడ్డి లేదా గుత్తా సుఖేంద‌ర్‌ రెడ్డి - ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ ఈ సీటు నుంచి కాంగ్రెస్‌ నేత - మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీరెడ్డిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. రాజ్‌ గోపాల్‌ రెడ్డి బీజేపీలో చేర‌క‌పోయినా కాంగ్రెస్‌ కు దూరం దూరంగానే ఉంటున్నారు.

మ‌రి వాస్త‌వంగా చూస్తే హుజూర్‌ న‌గ‌ర్‌ లో టీఆర్ ఎస్‌ - కాంగ్రెస్‌ కు బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. ఇక్క‌డ ముందు నుంచి కాంగ్రెస్ చాలా బ‌లంగా ఉంది. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డ్డాక జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లోనూ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డే గెలిచారు. మ‌రి తెలంగాణ‌లో ఈ కీల‌క ఉప ఎన్నిక‌లో బీజేపీ నుంచి అన్ని విధాలా బ‌ల‌మైన అభ్య‌ర్థిగా ఉన్న ల‌క్ష్మి రంగంలో ఉంటే హుజూర్‌ న‌గ‌ర్ వార్ హీటెక్క‌డం ఖాయం.