Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ‘ఖుష్బూ’ను బీజేపీ గుర్తించింది!

By:  Tupaki Desk   |   8 Oct 2021 7:33 AM GMT
ఎట్టకేలకు ‘ఖుష్బూ’ను బీజేపీ గుర్తించింది!
X
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఖుష్బూకు ఓ పదవి దక్కింది. ఆ పార్టీ ప్రత్యేక ఆహ్వానితురాలిగా గురువారం ఆమెను నియమించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కుష్బూకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కూడా బీజేపీ కల్పించింది. టికెట్ ఇచ్చింది. తాజాగా చాలా రోజులకు ఓ ప్రత్యేక పదవితో గుర్తించారు.

తమిళనాడు ఎన్నికల్లో పోటీచేసి ఓడిన ఎల్ మురగన్ కు కేంద్రసహాయ మంత్రి పదవి దక్కింది. అన్నామలైకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలోనే ఖుష్బూకు కూడా కీలక పదవిని అప్పగిస్తారని మద్దతుదారులు, అభిమానులు ఎదురుచూశారు. అయితే ఆమె పార్టీకి ప్రత్యేక ఆహ్వానితురాలు పదవిని అప్పగించారు. అలాగే సీనియర్ నేతలు హెచ్.రాజకు ప్రత్యేక ఆహ్వానితుడిగా మరో నేత పొన్ రాధాకృష్ణన్ ను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు.

కరోనా దృష్ట్యా శుక్ర, శని, ఆదివారాల్లో ఆలయాల్లోకి భక్తులను అనుమతించకపోవడంపై తాజాగా బీజేపీ ఆందోళన బాటపట్టింది. ఖుష్బూ దగ్గరుండి మరీ ఈ నిరసనలో పాలుపంచుకుంటోంది. బీజేపీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల వద్ద గురువారం నిరసనలు జరిగాయి. ముఖ్య నేతల నేతృత్వంలో 12 ప్రసిద్ధి చెందిన ఆలయాల వద్ద పార్టీ వర్గాలు నిప్పుల కుండను చేత బట్టి నిరసన తెలిపారు.

చెన్నై కాళికాంబల్ ఆలయం వద్ద జరిగిన నిరసనకు హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ మద్యం దుకాణాలు, సినిమాహాళ్లకు లేని ఆంక్షలు.. ఆలయాలపై ఎందుకని నిలదీశారు. ఏకపక్ష ధోరణి అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఆలయాల్లోకి భక్తులను పూర్తి స్థాయిలో అనుమతించాల్సిందేనని డిమాండ్ చేశారు.