Begin typing your search above and press return to search.

రాజ్యసభ పై కమలం ఫోకస్.. ఏపీలో ఒక స్థానంపై కన్ను

By:  Tupaki Desk   |   25 Feb 2020 2:30 PM GMT
రాజ్యసభ పై కమలం ఫోకస్.. ఏపీలో ఒక స్థానంపై కన్ను
X
రాజ్యసభలో అధికార పక్షం ఎన్డీఏకి విపత్కర పరిస్థితులు ఉన్నాయి. అందుకే కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ, త్రిబుల్ తలాక్, పౌరసత్వ సవరణ చట్టం తదితర బిల్లులను ఆమోదించుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి చుక్కలు కనిపించాయి. ఎలాగోలా వాటిని ఆమోదించప చేసుకుని చట్టంగా చేసినప్పటికీ రాజ్యసభలో సీట్లు తక్కువ ఉండడంతో బీజేపీ అధిష్టానం ఇప్పుడు బలం పెంచుకునేలా చర్యలు చేపట్టింది. గతంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకుంది. అయితే ఇంకా చాలా సీట్లు కావాల్సి ఉంది. బిల్లులు ఆమోదం పొందాలంటే మరింత బలం అవసరం. కొన్ని బిల్లులు ఆమోదం కోసం ఇతరుల పై ఆధార పడాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు భవిష్యత్ లో బీజేపీ సీట్లు మరింత గా తగ్గనున్నాయి. అందుకే ముందస్తు కసరత్తులు చేస్తోంది కమలం పార్టీ.

ప్రస్తుతం 51 రాజ్యసభ స్థానాలు త్వరలోనే ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రకటన విడుదల చేసింది. వీటిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే అధిక సీట్లు కోల్పోనున్నాయి. బీజేపీ నుంచి 18 సీట్లు ఖాళీ అవుతుండగా, ఆ పార్టీ నుంచి 13 మంది మాత్రమే మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖాళీ అయ్యే సీట్లల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి అయిదుగురు, బిజూ జనతాదళ్‌, ఆర్‌జేడీ, జేడీ(యూ), ఎన్‌సీపీల నుంచి ఇద్దరు చొప్పున, శివసేన, డీఎంకే, జేఎంఎంల నుంచి ఒక్కొక్కరు చొప్పున తిరిగి ఎన్నికవనున్నారు.

ఇక కాంగ్రెస్‌ సభ్యులు 11 మంది రిటైర్‌ అవుతుండగా తిరిగి 10 మందే ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కోటా నుంచి కే. కేశవరావు, తోట సీతారామలక్ష్మి, సుబ్బిరామిరెడ్డి, ఏం.ఏ ఖాన్‌, తెలంగాణ కోటా నుంచి కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్ రావుల సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలన్నీ ఆంధ్రపదేశ్ లోని వైఎస్సార్సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్ల కోసం ఇప్పటికే ప్రకటన విడుదలైంది. మార్చి 16వ తేదీన నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేది. మార్చి 26వ తేదీన పోలింగ్ జరగనుండగా… అదే రోజున లెక్కింపు జరుగుతోంది.

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు సీట్ల కోసం ఇప్పుడు తీవ్ర పోటీ ఏర్పడింది. శాసనమండలి రద్దు అయితే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాశ్ చంద్రబోస్‌ మంత్రులుగా తప్పుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యం లో వారిని రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయి. వారు కాకుంటే తనకు వెన్నంటే ఉన్న షర్మిల, సజ్జల, వైవీ సుబ్బారెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్ రావు, సినీనటుడు చిరంజీవివి రాజ్యసభ పంపించే వారి జాబితా లో పేర్లు ఉన్నాయి.

అయితే రాజ్యసభలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సమయంలో వైఎస్సార్సీపీని మచ్చిక చేసుకుని ఒక రాజ్యసభ స్థానాన్ని బీజేపీ ఆశిస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి హోం శాఖ మంత్రి అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో జగన్ ను బీజేపీ అధిష్టానం కోరినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇఫ్పటికే ఇద్దరు బీజేపీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరొకరికి స్థానం ఇస్తే తాము ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తామని చెప్పినట్లు ఢిల్లీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో న్యాయస్థానాలతో జగన్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఒక స్థానం బీజేపీకి ఇస్తే కొంత ఊరట లభించే అవకాశం ఉంది. పైగా శాసనమండలి రద్దు బిల్లు ఆమోదం కూడా లభించి రాష్ట్రంలో పై చేయి సాధించేట్టు ఉండడం తో జగన్ బీజేపీకి ఒక స్థానం కేటాయించే అవకాశం మెండుగా ఉంది.