Begin typing your search above and press return to search.

గడ్కరీ అంటే గడగడ : అమిత్ షా గంటల తరబడి...?

By:  Tupaki Desk   |   21 Aug 2022 1:30 AM GMT
గడ్కరీ అంటే గడగడ :  అమిత్ షా గంటల తరబడి...?
X
ఇపుడు దేశంలో ఒక హాట్ టాపిక్ గా నితిన్ గడ్కరీ ఉన్నారు. ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయన 2014 నుంచి గత ఎనిమిదేళ్ళుగా కీలకమైన శాఖలను చూస్తూ వస్తున్నారు. గడ్కరీ మంచి పనిమంతుడు. నిబద్ధత కలిగిన నాయకుడు. నిజాయతీపరుడు. అన్నింటికీ మించి సొంత వ్యక్తిత్వం కలిగిన వారు. ఆయన బీజేపీలో బాగా  ఎత్తున ఉన్న నేత. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కి సరైన జోడీ. మోడీ ఏ కారణం చేత అయినా 2024 తరువాత ప్రధాని కాకపోతే ఆ సీటు నేరుగా వచ్చి వరించేది నితిన్ గడ్కరీనే. ఆయన అంతటి సమర్ధుడు. యోగ్యుడు కాబట్టేనా బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆయన్ని సడెన్ గా తప్పించేశారు అంటే జవాబు అవును అనే అనుకోవాలి.

ఇదిలా ఉంటే గడ్కరీ 2009 నుంచి 2013 వరకూ రెండు సార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కోసమే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చారు. అంటే సెకండ్ టైమ్ ఆయనకు చాన్స్ ఇవ్వడానికి అన్న మాట. ఇక 1989లో మహారాష్ట్ర శాసన‌మండలికి తొలిసారి నెగ్గిన గడ్కరీ ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. బీజేపీ శివసేన ప్రభుత్వం 1995లో మహారాష్ట్రలో తొలిసారి ఏర్పడినపుడు ఆయన పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి గా పనిచేశారు. అపుడే మంత్రిగా మంచి మార్కులు సంపాదించారు.

ఇక మోడీ క్యాబినేట్ లో ఆయనకు 2014లోనే కీలకమైన శాఖలు దక్కుతాయి అనుకుంటే దక్కలేదు. మొదట  మౌలిక సదుపాయాల కల్పన శాఖను ఇస్తారనుకుంటే  చివరకు ఆయనకు ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్ శాఖ లభించింది. అయితే తరువాత కాలంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, జల్ శక్తి మంత్రి గోపీనాథ్ ముండే అకస్మాత్తుగా మరణించడంతో ఆయన పోర్ట్ ఫోలియోలు కూడా గడ్కరీకి వచ్చాయి. కానీ  కొన్ని రోజుల తర్వాత ఆ శాఖలను వేరే వారికి ఇచ్చేశారు మోడీ.

ఇక 2017లో జలవనరులు, గంగా నది, నదుల అభివృద్ధి శాఖను కూడా గడ్కరీకి అప్పగించారు. కానీ రెండవమారు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గడ్కరీకి రోడ్డు రవాణా, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖను ఇచ్చారు. అయితే ఇందులో కూడా కొంతకాలానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖను వెనక్కి తీసుకున్నారు. ఇలా గడ్కరీని మోడీ ఎంతలా తగ్గించాలో అలా తగ్గిస్తూ వస్తున్నారు.

మరి గడ్కరీతో మోడీకి పడదా అమిత్ షా ఆయనతో ఎలా ఉంటారు అంటే దీనికి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 2009లో గడ్కరీ జాతీయ అధ్యక్షుడు అయినపుడు మోడీకి గిట్టని గుజరాత్ బీజేపీ నేత  సంజయ్ జోషీని తెచ్చి విశేష అధికారాలు ఇచ్చారు. ఆ మంట మోడీలో ఉంది అని చెబుతారు. ఆ తరువాత యూపీ బాధ్యతలను కూడా జోషీకి అప్పగించారు. అది గిట్టని మోడీ యూపీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళలని నాడు చెప్పారని కూడా ప్రచారంలో ఉన్న మాట. అలా మోడీకి గడ్కరీకి పూర్వాశ్రమాల్లో కూడా గ్యాప్ ఉందని చెబుతారు.

మోడీ ప్రభ ఎంతలా వెలిగినా గడ్కరీ మాత్రం ఆయన్ని ఏనాడూ ప్రశంసించలేదు.  తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నారు. పైగా ప్రభుత్వ లోపాలను ఆయన బాహాటంగా చెబుతూ వచ్చారు. ఇక రాజకీయ నాయకులు పనిచేయాలి తప్ప కలలలో జనాలను ఉంచకూడదు అని ఆయన చేసిన కామెంట్స్ కూడా మోడీ షాలకు గుచ్చుకున్నాయని అంటారు. అదే విధంగా దేశంలో బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండాలని గడ్కరీ కోరుకున్నారు. అది మోడీ అమిత్ షాలకు గిట్టదన్నది తెలిసిందే. ఒకానొక సభలో ఇందిరాగాంధీని గొప్ప నాయకురాలు అని గడ్కరీ పొగిడి బీజేపీని ఇరుకున పెట్టారు.

ఇక నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉండగా అమిత్ షా ఆయన కోసం గంటల తరబడి వేచి ఉన్న సందర్భాలు కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నాయి. ఇపుడు మోడీ అమిత్ షా జమానా సాగుతోంది. అయినా సరే బీజేపీ అంటే కార్యకర్తలదని, అది మోడీ అమిత్ షా సొత్తు కాదని అనగలిగే గట్స్ గడ్కరీకే ఉన్నాయి. ఆయన విపక్షాలకు బహు ఇష్టుడు. ఆయన రాజకీయాలు కాదు అభివృద్ధి ముఖ్యమని చెప్పే మనిషి. ఆచరించే మనిషి.

ఇక మహరాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో సీనియర్ గా ఉన్న గడ్కరీ ఏనాడో సీఎం కావాలి కానీ ఆయన కంటే జూనియర్ అయిన దేవేందర్ ఫడ్నవీస్ ని తెచ్చి సీఎం గా చేసి  మోడీ అమిత్ షా ఆయనకు అలా చెక్ పెట్టేసారు. ఇక తప్పని పరిస్థితుల్లో గడ్కరీకి కేంద్ర మంత్రిగా ఇచ్చారు. 2024లో మరోసారి మోడీ షా నాయకత్వంలో బీజేపీకి మంచి మెజారిటీ వస్తే మాత్రం కేంద్ర మంత్రిగా కూడా గడ్కరీకి చాన్స్ ఉండదని అంటారు.

ఇక గడ్కరీ పని బీజేపీలో అయిపోయినట్లేనా అంటే ఆయన లాంటి నిజాయతీపరులను కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘ్ పరివార్ మీదనే ఉంది అని అంటున్నారు. 2024 నాటికి గడ్కరీ ప్రధాని అయ్యేలా సంఘ్ తన ప్రతాపం చూపిస్తేనే బీజేపీకి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. లేకపోతే ఒక అద్వానీ వెంకయ్యనాయుడు మాదిరిగా గడ్కరీ కూడా రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్తారని అంటున్నారు.

అది ఆయన కంటే దేశానికే ఎక్కువ నష్టమని అంటున్నా వారే విపక్షంలో కూడా ఉన్నారు మరి. దటీజ్ నితిన్ గడ్కరీ. మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గడ్కరీ ఎంకాం ఎల్ ఎల్ బీ దాకా చదివారు. ఏబీవీపీ నుంచి విద్యార్ధి రాజకీయాల్లో ప్రవేశించి ఈ రోజుకు ఈ స్థాయికి చేరుకున్నారు. మరి ఆయన సమర్ధత పార్టీకి అవసరం ఉందా లేదా అన్నది కొద్ది కాలంలోనే తేలిపోతుంది.