Begin typing your search above and press return to search.

తన చేతికి మట్టి అంటకుండా బీజేపీ గేమ్?

By:  Tupaki Desk   |   7 Jun 2019 1:30 AM GMT
తన చేతికి మట్టి అంటకుండా బీజేపీ గేమ్?
X
కర్ణాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి త్వరలో మిత్రపక్షం నుంచి గట్టి షాక్‌ ఎదురు కానుంది. కాంగ్రెస్‌ లోని అసంతృప్త ఎమ్మెల్యేలు సుమారు పది మంది వరకు సొంత పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం దాదాపు ఖాయమైనట్లే. ఆరంభం నుంచి సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ నేతలు పెద్ద సమస్యగా మారారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్యపై జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌.విశ్వనాథ్‌ ఆరోపించారు.

అంతేకాకుండా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రోషన్‌ బేగ్ - రామలింగారెడ్డి కూడా పార్టీ పెద్దలపై అకలబూనారు. బహిరంగ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీరికి తోడు మాజీ మంత్రి రమేశ్‌ జార్కి హోళి తనదైన శైలితో అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు మరికొందరితో కలిసి మూకుమ్మడిగా రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటామని గతంలోనే తెలిపారు. అయితే ఈనెల 9వ తేదీన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరికి కేబినెట్‌ లో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఈక్రమంలో తమకు అన్యాయం జరుగుతుందని భావించిన నేతలు మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి నేతృత్వంలో ఈనెల 8వ తేదీ సమావేశమై 9వ తేదీ రాజీనామా చేస్తారని సమాచారం.

లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ హవా సాగింది. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి ఘోరంగా ఓడిపోయింది. ఇందుకు కారణం కాంగ్రెస్‌ నేతలే అని జేడీఎస్‌ నాయకులు బహిరంగ విమర్శలు చేశారు. దీనికి స్పందనగా కాంగ్రెస్‌ నాయకులు కూడా అదే రీతిలో విమర్శలకు దిగారు. ఫలితంగా ఇద్దరి మధ్య సమన్వయం మరింత కొరవడింది. లోక్‌ సభ ఫలితాల నాటి నుంచి సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి మరింత దిగజారిందని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వాన్ని కాపాడేందుకు మాజీ సీఎం సిద్ధరామయ్య రంగంలోకి దిగి బుజ్జగించారు.

కేబినెట్‌ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సీఎం కుమారస్వామి కూడా బాధ్యతగా ప్రభుత్వ మనుగడకు కృషి చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ తన కుర్చీ కాపాడుకునేందుకే సరిపోయారని చెప్పవచ్చు. దీనికి తోడు మాజీ ప్రధాని దేవెగౌడ సలహాలు - సూచనలు కాంగ్రెస్‌ లోని చాలామందికి నచ్చడం లేదు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం పతన స్థాయికి దిగజారిందని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలోకి వెళ్లలేదని.. కేవలం బెదిరింపులు మాత్రమేనని కర్ణాటక కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ లోలోపల మాత్రం అసమ్మతి సెగలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంది. ప్రస్తుతం జేడీఎస్‌ 37 - కాంగ్రెస్‌ 79 కలిపి 116 మంది ఉన్నారు. అయితే ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున పాలక పక్షానికి ప్రస్తుతం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంచనా. అయితే ఉన్నఫలంగా 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. దీనికి తోడు బీజేపీ ప్రస్తుతం 105 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉంది. మరో 10 మంది చేరితే 115కు చేరుతుంది. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లుగా చెప్పవచ్చు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని అంచనా వేస్తున్నారు.