Begin typing your search above and press return to search.

గుడ్లు తేలేసిన ఎగ్జిట్ పోల్స్.. అడ్డం తిరిగిన కథ!

By:  Tupaki Desk   |   25 Oct 2019 2:30 PM GMT
గుడ్లు తేలేసిన ఎగ్జిట్ పోల్స్.. అడ్డం తిరిగిన కథ!
X
కొన్ని చానళ్లు కేంద్రంలో అధికార పార్టీకి బాకా ఊదుతున్నాయని కాంగ్రెస్ వాళ్తు నెత్తినోరు బాదుకుంటున్నారు. చర్చకు ఉండాల్సిన అంశాల గురించి మాట్లాడకుండా, మోడీ గురించి గప్పాలు కొడుతూ మీడియా ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉందని - భావోద్వేగాలను బీజేపీ రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని చూస్తుంటే - మీడియా కూడా అందుకు వంత పాడుతూ ఉందని కాంగ్రెస్ వాళ్లు వాపోతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా గుడ్లు తేలేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్ర - హర్యానా.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధిస్తుందంటూ పలు జాతీయ చానళ్లు తమ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో పేర్కొన్నాయి. ప్రీ పోల్ సర్వేల్లోనే ఆ విషయాన్ని గట్టిగా చెప్పాయి. అలా ప్రజలను ఒక అభిప్రాయానికి తీసుకెళ్లాయి. కాంగ్రెస్ లో పోరాట స్ఫూర్తిని దెబ్బతీశాయి.

అయితే అసలు ఫలితాలు మాత్రం వేరేలా వచ్చాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచినన్ని సీట్లు గెలవడం కూడా కష్టమే అని కొన్ని సర్వేలు చెప్పాయి - హర్యానాలో అయితే ఆ పార్టీ కేవలం పది సీట్లకు పరిమితం అవుతుందన్నాయి. బీజేపీ బంపర్ మెజారిటీలు సాధిస్తుందని ప్రకటించాయి మీడియా వర్గాలు. అయితే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి దక్కింది బోటాబోటీ మెజారిటీనే. సొంతంగా ఏమీ బీజేపీ అధికారంలోకి రాలేదు.

దీంతో ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత మరింత తగ్గిపోయింది. ఇండియాటుడే ఎగ్జిట్ పోల్ మాత్రమే.. హర్యానాలో బీజేపీ - కాంగ్రెస్ ల మధ్యన హోరాహోరా పోరు ఉందని చెప్పింది. మిగతవన్నీ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కథ కంచికే అన్నాయి. అయితే అందుకు వాస్తవిరుద్దమైన ఫలితాలు వెల్లడి అయ్యాయి అధికారికంగా. ఇదంతా కార్పొరేట్ లాబీ ఫలితమే అని - చానళ్లు అమ్ముడిపోయి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.