Begin typing your search above and press return to search.

బీజేపీ గ్లామర్ : జయప్రదంగా తెలుగు రాజకీయం

By:  Tupaki Desk   |   31 May 2022 1:30 AM GMT
బీజేపీ గ్లామర్ : జయప్రదంగా తెలుగు రాజకీయం
X
ఆమె సత్యజిత్ రే వంటి ప్రఖ్యాత దర్శకుడి మన్ననలు పొందిన అందగత్తె. ఆమె నిన్నటి సినీ సీమను ఏలిన అందాల‌ తార. జయప్రదంగా తెలుగు హిందీ సహా అనేక భాషా చిత్రాలలో నటించి మెప్పించిన మేటి. నటీమణి. ఇక ఆమెది రాజకీయాల్లోనూ అందెవేసిన చేయి. ఆమె భారతీయ తార జయప్రద.

ఆమె అనేకసార్లు రాజ్యసభ, లోక్ సభల నుంచి ఎంపీగా గెలిచి సత్తా చాటారు. తెల్జుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీయార్ చలువతో రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద తరువాత కాలంలో టీడీపీ తరఫున ఫస్ట్ టైమ్ రాజ్యసభ మెంబర్ అయ్యారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా చంద్రబాబు నాయకత్వాన పనిచేశారు.

అయితే రెండవసారి ఆమె రాజ్యసభ రెన్యూల్ కాలేదు, దానికి తోడు ఆమెకు అధినాయకత్వంతో ఏర్పడిన గ్యాప్ నేపధ్యంలో ఆ పార్టీని వదిలి ఉత్తరాది రాజకీయాలకు షిఫ్ట్ అయిపోయారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఆమె చట్టసభలలో ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆ మధ్యన ఆమె బీజేపీలో చేరిపోయారు. ఇపుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పక్షాన పనిచేస్తున్న జయప్రద దశాబ్దాల కాలం తరువాత తాను పుట్టిన తెలుగు గడ్డ మీద పనిచేయాలని మనసు పడుతున్నారు.

ఈ మధ్య ఎన్టీయార్ జయంతి సందర్భంగా ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో అన్న గారికి ఘన నివాళి అర్పించిన జయప్రద తన రాజకీయ జీవితం ఆయన చలవే అని చెప్పుకున్నారు. అంతే కాదు ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడవడం బాధాకరం అయిన ఘటన అని, అలా చేసి ఉండరాదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఆమె తెలుగు రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా చెప్పుకున్నారు.

తనకు తెలుగు రాజకీయాల్లో పనిచేయాలని ఆసక్తి ఉందని కూడా జయప్రద మనసులో మాటనుతాజాగా బయటపెట్టారు. అయితే బీజేపీ తనకు ఉత్తరప్రదేశ్ లో పనిచేయమని ఆదేశాలు ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. తన మనసు మాత్రం అయితే తెలంగాణా లేకపోతే ఆంధ్రాలో ఎక్కడైనా బీజేపీకి పనిచేయమని అంటోందని చెప్పుకున్నారు.

తన విన్నపాన్ని బీజేపీ మన్నిసే కనుక తాను తెలుగు రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తాను అని ఆమె అంటున్నారు. రాజమండ్రీలో పుట్టిన జయప్రద జాతీయ నటిగా ఎదిగారు. మంచి హిందీ మాట్లాడే ఆమె జాతీయ నాయకురాలిగా కూడా సత్తా చాటారు. అయితే ఇపుడు తెలుగు రాష్ట్రాలలో బలపడాలని చూస్తున్న బీజేపీకి అచ్చమైన గ్లామర్ గా జయప్రద ఉన్నారని అంటున్నారు.

ముఖ్యంగా ఆంధ్రాలో బీజేపీని ఆకర్షణ మరింత కావాల్సి ఉంది. దాంతో రానున్న రోజుల్లో జయప్రదను ఏపీ గోదాలోకి దించుతారు అని అంటున్నారు. బలహీన వర్గాలకు చెందిన జయప్రద రాజకీయంగా, సామాజికపరంగా, గ్లామర్ పరంగా కూడా ఏపీ బీజేపీకి అన్ని విధాలుగా అండగా ఉంటారని అంటున్నారు.

మరి రోగి కోరింది, వైద్యుడు ఇచ్చినది ఒకటే అయితే కనుక తెలుగు రాజకీయాలలో జయప్రదంగా ఆమె మలి విడత ప్రస్థానం సాగిపోతుంది అనే చెప్పాలి. ఆమెను ముందు బెట్టి బీసీలను కూడా ఆకట్టుకునే వ్యూహానికి కూడా బీజేపీ తెర తీయవచ్చు అని కూడా అంటున్నారు.