Begin typing your search above and press return to search.

బొమ్మైకి.. బొమ్మ చూపిస్తున్నారుగా!

By:  Tupaki Desk   |   31 July 2021 11:30 PM GMT
బొమ్మైకి.. బొమ్మ చూపిస్తున్నారుగా!
X
క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిగా బ‌స‌వ‌రాజు బొమ్మై నియామ‌కంతో పంచాయతీ అయిపోయింద‌ని అంతా అనుకున్నారు. నెల‌ల త‌ర‌బ‌డి సాగిన ర‌చ్చ ముగిసిపోయింద‌ని భావించారు. కానీ.. అస‌లు క‌థ ఇప్పుడే మొద‌లైంది అని చాటి చెబుతున్నాయి కొత్త ప‌రిణామాలు. అంతేకాదు.. ఇవి బొమ్మై స‌ర్కారును స‌జావుగా ముందుకు సాగ‌నిస్తాయా? అనే సందేహాల‌కూ అవ‌కాశం ఇస్తున్నాయి. ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చున్న బొమ్మై.. ఇంకా త‌న మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్నదే లేదు. కానీ.. ఈ లోగానే స‌వాళ్లు ముందుకొచ్చి కూర్చున్నాయి. వాటిని ఎలా స‌రిచేసుకుంటూ వెళ్తార‌న్న‌దే ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది.

ద‌క్షిణాదిన బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటైంది ఒక్క క‌ర్నాట‌క‌లోనే. ఉత్త‌రాదిన మొత్తం ఊపేసినా.. ఊడ్చేసినా.. సౌత్ మాత్రం కొర‌క‌రాని కొయ్య‌గా మారింది క‌మ‌ల‌ద‌ళానికి. అలాంటి పార్టీకి.. క‌న్న‌డ‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డంతో ఎంతో ధైర్యం వ‌చ్చింది. దీనికి ప్ర‌ధాన కార‌కుడు నిస్సందేహంగా య‌డ్యూర‌ప్పే. అలాంటి వ్య‌క్తిని ముఖ్య‌మంత్రి పీఠం మీద నుంచి త‌ప్పించింది బీజేపీ. ఆయ‌న‌పై వ‌చ్చిన అవినీతి, ఇత‌ర‌త్రా ఆరోప‌ణ‌లు బ‌ల‌మైన‌వి కావ‌డంతో.. అనివార్యంగా క‌మ‌ల‌నాథులు ఆ ప‌నిచేశారు. అయితే.. య‌డ్యూర‌ప్ప లాంటి సీనియ‌ర్ కు, పార్టీకి ఆయువుప‌ట్టుగా ఉన్న నాయ‌కుడినే ప‌క్క‌న పెట్టేలా చేశారు పార్టీ స‌హ‌చ‌రులు. అలాంటిది.. చాలా మందికి జూనియ‌ర్ గా ఉన్న బ‌స‌వ‌రాజ్ బొమ్మై వారిని ఎలా డీల్ చేయ‌గ‌ల‌రు? ఎలా నెగ్గుకు రాగ‌ల‌రు? అన్న‌దే స‌మ‌స్య‌. ఈ స‌మ‌స్య ఇప్ప‌టికే మొద‌లు కావ‌డం గ‌మ‌నార్హం.

నూతన మంత్రివర్గంలో ఎవ‌రెవ‌రు ఉండ‌బోతున్నారు? ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న‌వారిలో ఎంత‌మంది ప‌ద‌వి ఊడిపోతుంది? కొత్తగా ఎవ‌రికి ఛాన్స్ ఇవ్వ‌బోతున్నారు? ఇదే.. ఇప్పుడు క‌న్న‌డ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఇప్ప‌టికే కొంద‌రు నిర‌స‌న ధ్వ‌నులు వినిపించేస్తుండ‌డం ప‌రిస్థితి తీవ్ర‌కు అద్దం ప‌డుతోంది. గ‌తంలో క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన జ‌గ‌దీష్ షెట్ట‌ర్‌.. య‌డ్యూర‌ప్ప కేబినెట్లో మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న రీసెంట్ మాట్లాడుతూ బొమ్మై కేబినెట్లో త‌న‌కు సీటు అవ‌స‌రం లేద‌ని చెప్పేశారు. కార‌ణం ఏమంటే.. ముఖ్య‌మంత్రి సీటు ఆశించిన వారిలో జ‌గ‌దీష్ కూడా ఉన్నారు. త‌న‌కు కాకుండా.. బొమ్మైకి ఇవ్వ‌డం ప‌ట్ల ఆయ‌న గుర్రుగా ఉన్నార‌నే విష‌యం.. ఈ ప్ర‌క‌ట‌న‌తో తేలిపోయింది.

ఇక, మ‌రో సీనియ‌ర్ నేత శ్రీరాములు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నిజానికి క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ శ్రీరాములుకు హైక‌మాండ్ ఫుల్ ప్ర‌యారిటీ ఇచ్చింది. ఒక దశలో ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంద‌నే ప్ర‌చారం సాగింది. కానీ.. ఇప్పుడు ఆయ‌న ఊసే లేకుండా పోయింది. దీంతో.. శ్రీరాములు ఆగ్ర‌హంగా ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వీళ్లేకాకుండా.. మంత్రివ‌ర్గంలో త‌మ‌కు సీటు రాక‌పోతే ఊరుకునేది లేద‌ని చాలా మంది అంటున్నార‌ట‌. ఐదు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణ‌యించినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిని కూడా సామాజిక వ‌ర్గాల వారీగా కేటాయించాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇవి కూడా త‌మ‌కు కావాలంటే.. త‌మ‌కే కావాల‌ని ప‌ట్టుబడుతున్నారట చాలా మంది.

సీఎం సీటుపై కూర్చునేందుకు త‌హ‌త‌హ‌లాడిన‌ వారి సంఖ్య త‌క్కువేమీ లేదు. గ‌త కేబినెట్లో గ‌నుల శాఖ మంత్రిగా ఉన్న‌ ముర‌గేష్ నిర్వాణి, ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ ల‌క్ష్మ‌ణ స‌వాది, కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి, మ‌రో డిప్యూటీ సీఎం అశ్వ‌థ్ నారాయ‌ణ, స్పీక‌ర్ విశ్వేశ్వ‌ర‌ కాగేరి, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ కూడా రేసులో ఉన్న‌వారే. వీరంతా నిరుత్సాహంలోనే ఉన్నార‌ని టాక్‌. వీరి ప‌రిస్థితి ఇలా ఉంటే.. జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మిని ప‌డ‌గొట్టి మ‌రీ.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న‌వారి ప‌రిస్థితి మ‌రోలా ఉంది. అస‌లు.. త‌మ‌ను ప‌ట్టించుకుంటారా? అనే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ ప‌రిస్థితుల‌న్నీ కొత్త‌సీఎం బొమ్మైకి బొమ్మ చూపించేలాగానే ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి, వీటిని బ‌స‌వ‌రాజ్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.