Begin typing your search above and press return to search.

జగన్ మీద ప్రేమా లేక కేసీయార్ మీద కోపమా...?

By:  Tupaki Desk   |   30 Aug 2022 12:30 AM GMT
జగన్ మీద ప్రేమా లేక  కేసీయార్ మీద కోపమా...?
X
మొత్తానికి ఆరేళ్ల తరువాత కేంద్రంలోని బీజేపీలో కదలిక వచ్చింది. ఏపీ మీద కాస్తా ప్రేమనే చూపించింది. అదే సమయంలో తమ రాజకీయ క్షేత్రం అనుకున్న తెలంగాణాలో అక్కడ అధికార పార్టీ టీయారెస్ మీద కన్నెర్ర చేసింది. ఎప్పటినుంచో ఏపీ మొత్తుకుంటున్న విత్యుత్ బకాయిల విషయంలో కేంద్రం తెలంగాణాను గట్టిగానే ఆదేశించింది.

విద్యుత్ బకాయులుగా వేల కోట్లుగా ఉన్న మొత్తాన్ని చెల్లించి తీరాల్సిందే అని హుకుం జారీ చేసింది. దీనికి నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. ఈ వివరాలు కనుక చూస్తే 2014 నుంచి 2017 దాకా ఉన్న కాలంలో తెలంగాణ డిస్కంలకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్ద్ద మొత్తంలోనే బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆరు వేల పై చిలుకుగా ఈ మొత్తాలని రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేల్చింది

ఇందులో 3,441 కోట్ల రూపాయలు అసలు మొత్తం అయితే లేట్ పేమెంట్ సర్ చార్జీలు పేరిట మరో 3,315 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ 6, 766 కోట్ల రూపాయల అతి పెద్ద మొత్తాన్ని చెల్లించమంటూ ఎప్పటి నుంచో చంద్రబాబు, జగన్ కోరుతూనే ఉన్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్ళి మరీ మొరపెట్టుకున్నారు.

లేటెస్ట్ గా జగన్ చేసిన ఢిల్లీ టూర్ లో ప్రధానితో పాటు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలసి ఈ విషయం మీద చర్చించారు. నిజానికి ఎప్పటి నుంచో ఈ విషయం అడుగుతున్నా పట్టని కేంద్రం ఇపుడు మాత్రం సడెన్ గా ఆదేశాలు తెలంగాణా సర్కార్ కి జారీ చేయడం మాత్రం విచిత్రంగానే ఉంది అంటున్నారు.

ఇక్కడ రాజకీయం ఏమైనా కీలక పాత్ర పోషించిందా అన్న చర్చ కూడా వస్తోంది. కేసీయార్ ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్న కేంద్రం ఉన్నఫళంగా ఆరు వేల కోట్లను అది కూడా నెల రోజుల వ్యవధిలోగా చెల్లించమని కోరడమంటే కేసీయార్ కి బిగ్ ట్రబుల్స్ క్రియేట్ చేయడమే అని అంటున్నారు.

ఆ విధంగా కేసీయార్ మీద వత్తిడి పెట్టడం ద్వారా అక్కడ రాజకీయంగా తాము సాధించవచ్చు అన్న ఆలోచన ఉంది. అదే టైమ్ లో ఏపీకి తాము న్యాయం చేస్తున్నామని చెప్పుకునే వీలు ఉంది. మరి జగన్ మీద ఏమైనా ప్రేమ కాదు కదా అంటే అది కూడా అనుకోవచ్చు అనే అంటున్నారు.

ఈ మధ్య టీడీపీతో టచ్ లోకి బీజేపీ వారు వెళ్తున్నారు అన్న వార్తలతో జగన్ కలత చెందారు అని ప్రచారం అవుతున్న నేపధ్యంలో ఈ విధంగా చేయడం ద్వారా బీజేపీ ఏమైనా సంతోషపెట్టాలనుకుంటోందా అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా బీజేపీ పొలిటికల్ రూటే సెపరేట్ కాబట్టి ఏమైనా అనుకోవచ్చు. ఏమైనా జరగవచ్చు కూడా. ఇక్కడ తమ రాజకీయం తాము చేసుకునే విధంగానే ఆ పార్టీ ఎత్తులు ఉంటాయన్నది వాస్తవం అంటున్నారు. సో ఎలా అనుకున్నా అనుకోవచ్చు మరి.