Begin typing your search above and press return to search.

ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కారు?

By:  Tupaki Desk   |   13 Jan 2023 12:30 AM GMT
ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కారు?
X
కొత్త పార్టీ అంటూ రెచ్చిపోతున్న మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కి బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లు బీజేపీలో ఉండి ఎన్నికల వేళ కొత్త పార్టీ పెట్టి తోకజాడిస్తున్న ‘గాలి’ తీసేలా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.

గాలి జనార్ధన్ రెడ్డి ఆయువుపట్టుపై బీజేపీ దెబ్బ కొట్టింది. తాజాగా ఆయన అక్రమ ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. దీనిపై హైకోర్టుకు సమాచారం అందించిన ప్రభుత్వ తరుఫున న్యాయవాది.. జనార్ధన్ రెడ్డి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. కర్ణాటకతోపాటు ఏపీ, తెలంగాణలోని ఆస్తులను కూడా సీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు.

మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఆస్తులను అటాచ్ చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అనుమతి ఇవ్వడంలో జరిగిన జాప్యంపై సమాచారం ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మరో రెండు రోజుల గడువు ఇచ్చింది. గతంలో రూ.64 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి ఇవ్వగా, రూ.19 కోట్ల ఆస్తులను అటాచ్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

బళ్లారి అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితులపై అటాచ్‌మెంట్ ప్రొసీడింగ్స్‌ను ఆమోదించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ అభ్యర్థన ఆగస్టు 2022 నుంచి ప్రభుత్వం ముందు పెండింగ్‌లో ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రెడ్డి, ఆయన భార్య, కంపెనీ పేరిట అదనపు ఆస్తులను సీబీఐ గుర్తించింది. 2013 నుంచి ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్న అక్రమ మైనింగ్ కేసులో ఆ ఆస్తులను అటాచ్ చేయాలని ఏజెన్సీ కోరుతోంది.

అక్రమ మైనింగ్ కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులను తన కంపెనీలైన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్ ద్వారా విక్రయించేందుకు రెడ్డి ప్రయత్నిస్తున్నారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. గతేడాది డిసెంబర్ 25న కొత్త రాజకీయ పార్టీ ‘కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడైన ఆయన బీజేపీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు.

రాష్ట్రంలోని బళ్లారి జిల్లా వెలుపలి నుండి ఎన్నికల రాజకీయాలలోకి తిరిగి ప్రవేశించిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పల్ జిల్లాలోని గంగావతి నుండి పోటీ చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనపై బీజేపీ కొరఢా ఝలిపించి ఆయన ఆస్తులను సీజ్ చేసి పడేసింది. దేన్ని చూసుకొని మురుస్తున్నాడో.. ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.