Begin typing your search above and press return to search.

ఏమిటీ... పర్సనల్ అకౌంట్లు... !?

By:  Tupaki Desk   |   4 Aug 2018 3:57 PM GMT
ఏమిటీ... పర్సనల్ అకౌంట్లు... !?
X
పర్సనల్ అకౌంట్లు. బ్యాంకుల్లో ఎవరికి వారు తెరుచుకునే ఎస్బీ అకౌంట్లు. అవేనండీ... పర్సనల్ అకౌంట్లు. వీటిని ఎవరికి వారు బ్యాంకుకు వెళ్లి తెరచుకోవాలి. వాటికి ఉన్న నిబంధనలు ఆ వ్యక్తే బ్యాంకుకు తెలియజేయాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా 58,418 వ్యక్తిగత ఖాతాలు... అంటే పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయట. ఇది కూడా ప్రభుత్వం వివిధ పేర్లతో పలువురి పేరిట వ్యక్తిగత అకౌంట్లు తెరిచారని, అవి ఏకంగా 58, 418 అకౌంట్లని భారతీయ
జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీ.వి.ఎల్. నరసింహారావు ఆరోపిస్తున్నారు.

ఇది ఎలా జరిగిందని, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సరే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఉన్న వివాదాలు... గొడవలు... ఇతరేతర అంశాలను పక్కన పెడితే... సీవిఎల్ చేసిన ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనవే. ఒక ప్రభుత్వం తన హయాంలో ఏకంగా 58, 418 మందికి వ్యక్తిగత ఖాతాలు తెరిచిందంటే ఇది జాతీయ స్ధాయిలో కుంభకోణంగానే చూడాలి. ఇంత వరకూ బ్యాంకులను ముంచిన పారిశ్రామిక వేత్తలనే చూసిన దేశ ప్రజలకు బ్యాంకులను అడ్డం పెట్టుకుని కుంభకోణాలను చేస్తున్న ప్రభుత్వాలను కూడా చూడాల్సి వస్తుందేమో... !?

నిజానికి జీవీఎల్ ఆరోపణలో నిజం ఎంత... ఆరోపణలెన్నీ అని ఆరా తీయకుండా ఓ నిర్దారణకు రావడం సమంజసం కాదు కాని భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఈ ఆరోపణలు చేయడంతో వీటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకంగా 53 వేల కోట్ల ప్రభుత్వ ఆదాయం అధికారులు అకౌంట్లలోకి వెళ్లిందనే ఆరోపణల వెనుక ఖచ్చితంగా ఓ కుంబకోణం మాత్రం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలోని బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలోనే పని చేస్తాయి. అవి ప్రభుత్వమైనా... ప్రయివేట్ అయినా సరే. వీటి నియంత్రణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రిజర్వ్ బ్యాంక్ చేతుల్లోనే ఉంటుంది. అంటే ఏ బ్యాంకు ఏం చేసినా అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రిజర్వ్ బ్యాంకుకు తెలుస్తుంది. అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. అలా తెలిసిన వివరాలతోనే బిజెపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీ.వి.ఎల్.నరసింహారావు ఈ ఆరోపణలు చేసినట్లు స్పష్టమవుతోంది. దీనిపై జాతీయ స్ధాయిలో వెలుగులోకి తీసుకువస్తామని కూడా ఆయన చెబుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడి జాతీయ స్ధాయి ఇమేజ్ ఇక ఆ స్ధాయిలోనే గంగలో కలవడం ఖాయంగానే కనిపిస్తోంది.