Begin typing your search above and press return to search.

రాష్ట్ర‌ప‌తి గిరిజ‌నుల‌కు, ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ముస్లింల‌కు చాన్సు.. నిజ‌మెంత‌?

By:  Tupaki Desk   |   20 Jun 2022 5:55 AM GMT
రాష్ట్ర‌ప‌తి గిరిజ‌నుల‌కు, ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ముస్లింల‌కు చాన్సు.. నిజ‌మెంత‌?
X
జూలై 18న జ‌ర‌గ‌బోయే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థిగా బీజేపీ గిరిజ‌నుల‌కు చాన్సు ఇస్తోంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులోనూ మ‌హిళ‌కు అవ‌కాశ‌ముంటుంద‌ని జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. జార్ఖండ్ మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము, ఛ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్ అన‌సూయ ఉకీ ల్లో ఒక‌రిని రాష్ట్రప‌తి ప‌ద‌వికి ఎంపిక చేస్తార‌ని చెబుతున్నారు.

వీరిద్ద‌రూ గిరిజ‌న మహిళ‌లే కావ‌డం, ఇద్ద‌రూ క‌ర‌డు గ‌ట్టిన బీజేపీ నేత‌లు కావ‌డం విశేషం. అందులోనూ ద్రౌప‌ది ముర్ము, అన‌సూయ ఇద్దరూ బాగా చ‌దువుకున్న‌వారే. గిరిజ‌నుల స‌మ‌స్య‌లు, మ‌హిళా హ‌క్కులు త‌దిత‌ర అంశాల‌పై మంచి అవ‌గాహ‌న ఉంది. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రిలో ఒక‌రిని రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎంపిక చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి ద్రౌప‌ది ముర్ముని గ‌త రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలోనే అభ్య‌ర్థిగా ఎంపిక చేస్తార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. దాదాపు ఆమె అభ్య‌ర్థిత్వం ఖాయ‌మైపోయింద‌ని ప్ర‌సార మాధ్య‌మాలు వెల్ల‌డించేశాయి. అయితే చివ‌రి నిమిషంలో ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ద‌ళితుల కోటాలో చాన్సు ద‌క్కించుకున్నారు. ద్రౌప‌ది ముర్ము జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గా ఉండిపోయారు.

ప్ర‌స్తుతం త‌న ఐదేళ్లు కాలం పూర్తికావ‌డంతో ప్ర‌స్తుతం ఆమె ఖాళీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో దేశంలో 12 శాతం ఉన్న గిరిజ‌నుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి బీజేపీ.. ద్రౌప‌ది ముర్ము లేదా అన‌సూయ ఉకీని రాప్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తోంద‌ని స‌మాచారం. అందులోనూ మ‌ళ్లీ ఒక మ‌హిళ‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు ఉంటుంద‌ని ఆ పార్టీ ఆలోచ‌నగా ఉంద‌ని అంటున్నారు.

అలాగే ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య నాయుడు ప‌ద‌వీకాలం కూడా త్వ‌ర‌లో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈసారి ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ముస్లింకు అవ‌కాశ‌మివ్వాల‌ని బీజేపీ భావిస్తోంద‌ని తెలుస్తోంది. బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌క్వీని ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా దించుతార‌ని స‌మాచారం. అందులోనూ ముక్తార్ అబ్బాస్ న‌క్వీకి ఇటీవ‌ల రాజ్య‌స‌భ చాన్సు తిరిగి ఇవ్వ‌లేదు. రాజ్య‌స‌భ సభ్యుడిగా ఆయ‌న కాల‌ప‌రిమితి ముగిసింది. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎంపిక చేయ‌డానికే ఆయ‌నకు తిరిగి రాజ్య‌స‌భ చాన్సు ఇవ్వ‌లేద‌ని చెబుతున్నారు.

అంతేకాకుండా మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నేత‌లు నుపుర్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ముస్లిం దేశాల్లో తీవ్ర దుమారం లేపాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చ‌డం కోసం ఉపరాష్ట్ర‌ప‌తిగా ముస్లిం అభ్య‌ర్థికి అవ‌కాశ‌మిస్తార‌ని అంటున్నారు.