Begin typing your search above and press return to search.

హ‌రిబాబుకు అంత అవ‌మానం జ‌రిగింద‌ట‌!

By:  Tupaki Desk   |   18 April 2018 4:58 AM GMT
హ‌రిబాబుకు అంత అవ‌మానం జ‌రిగింద‌ట‌!
X
చేసిన పాపం ఊరికే పోదంటారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు ప‌రిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉందంటున్నారు. సొంత రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంటే నోరు విప్పి మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌ని ఆయ‌న్ను.. సొంత పార్టీ వారే ఫోన్ చేసి ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్న మాట‌ను చెప్పించుకున్నారా? అంటే అవున‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది.

అటు రాష్ట్రంలోనూ.. ఇటు పార్టీలోనూ త‌న‌కు వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న వేళ గౌర‌వంగా ప‌ద‌వి నుంచి రాజీనామా చేసి త‌ప్పు కోవాల్సింది పోయి.. ఫోన్ చేయించుకునే వ‌ర‌కూ హ‌రిబాబు ఎందుకు తెచ్చుకున్నార‌న్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది. ప‌ద‌వీ కాలం పూర్తి అయిన నేప‌థ్యంలో హ‌రిబాబు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు చెబుతున్నా.. అందులో నిజం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఏపీలో బీజేపీపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను అడ్డుకునే విష‌యంలో హ‌రిబాబు అడ్డంగా ఫెయిల్ అయ్యారంటూ అధినాయ‌క‌త్వం చెవిలో జోరీగ మాదిరి చేసిన ఫిర్యాదుల‌పై పాజిటివ్ గా రియాక్ట్ కావ‌ట‌మే తాజా ప‌రిస్థితికి కార‌ణంగా చెబుతున్నారు. విభ‌జ‌న‌తో తీవ్రంగా దెబ్బ తిన్న ఏపీని ఆదుకునే విష‌యంలో మోడీ స‌ర్కారు మైండ్ సెట్ మ‌రోలా ఉండ‌టం.. ఏపీలో పార్టీని మ‌రింత విస్త‌రించేందుకు నిధులు ప్ర‌వాహం అవ‌స‌రాన్ని అర్థ‌మ‌య్యేలా చెప్ప‌టంలో హ‌రిబాబు ఫెయిల్ అయ్యార‌నే చెప్పాలి.

దీనికి తోడు అధినాయ‌క‌త్వం కూడా ఏపీకి తామేం చేశామ‌న్న అంశంపై ప్ర‌చారం చేయాల‌న్న మాట‌ను చెప్ప‌టం.. ఏపీలోని వాస్త‌వ ప‌రిస్థితుల్ని అంగీక‌రించే ప‌రిస్థితుల్లో లేక‌పోవ‌టం హ‌రిబాబుకు ఇబ్బందిక‌రంగా మారింది. అటు అధినాయ‌క‌త్వానికి.. ఇటే ప్ర‌జ‌ల‌కు స‌ర్ది చెప్ప‌లేని వేళ‌.. ఆయ‌న్ను పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేయిస్తేనే మంచిద‌న్న ఆలోచ‌న‌కు బీజేపీ పెద్ద‌లు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

అన్నింటికి మించి హ‌రిబాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విశాఖ‌లో ప్ర‌ధాని మోడీ దిష్టి బొమ్మ‌ల్ని ద‌గ్థం చేయ‌టం.. విజ‌య‌వాడ‌లో నిర‌స‌న చేయ‌బోయిన బీజేపీ నేత‌ల‌పై చెప్పుల‌తో కొట్టే వ‌ర‌కూ ప‌రిస్థితి వెళ్ల‌టాన్ని పార్టీ తీవ్రంగా ప‌రిగ‌ణించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే హ‌రిబాబును త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. ఆ లేఖ‌ను అధినాయ‌క‌త్వానికి పంపాల్సిందిగా కోరిన‌ట్లుగా చెబుతున్నారు.

పార్టీ ముఖ్య‌నేత‌లు ఫోన్ చేసి రాజీనామా లేఖ పంపాల‌ని కోర‌టంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో హ‌రిబాబు రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హ‌రిబాబును ఎవ‌రితో రీప్లేస్ చేస్తార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. సంఘ్ బ్యాక్ గ్రౌండ్ లేని బీజేపీ నేత‌ల‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వొద‌న్న మాట‌తో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించ‌టం లేద‌ని చెబుతున్నారు. తాజాగా నెల‌కొన్న‌ ప‌రిస్థితుల్లో మాజీ మంత్రి మాణిక్యాల‌రావు లేదంటే సోము వీర్రాజుల‌లో ఎవ‌రో ఒక‌రికి అధ్య‌క్ష బాధ్య‌త‌లు ద‌క్కుతాయ‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం కాపు వ‌ర్గానికి చెందిన నేత‌కే పార్టీ ప‌గ్గాలు అప్ప‌జెబితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అధికార‌ప‌క్షానికి అధ్య‌క్షుడిగా క‌మ్మ‌.. విప‌క్షానికి రెడ్డి సామాజిక వ‌ర్గాల‌కు చెందిన అధినేత ఉన్న‌ప్పుడు.. ఏపీలో బ‌ల‌మైన మ‌రో వ‌ర్గ‌మైన కాపు వ‌ర్గానికి చెందిన నాయ‌కుడ్ని పార్టీ అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు అప్ప‌చెబితే మంచిద‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ అధినాయ‌క‌త్వం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఏపీకి పెద్ద ఎత్తున సాయం అందించాల్సింది పోయి కుల స‌మీక‌ర‌ణ‌తో నాయ‌కుడ్ని అధ్య‌క్షుడ్ని చేస్తే ఉప‌యోగం ఉంటుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.