Begin typing your search above and press return to search.

క‌న్నాతో బీజేపీ అన్ హ్యాపీ !

By:  Tupaki Desk   |   14 Oct 2018 12:37 PM GMT
క‌న్నాతో బీజేపీ అన్ హ్యాపీ !
X
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు కలిగిస్తారని, పార్టీకి మంచి రోజులు తీసుకువస్తారనే ఆశతో కొత్తగా పార్టీలోకి వచ్చిన కన్నా లక్ష్మీ నారాయణను పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలు అప్పగించిన తర్వాత పార్టీలో సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్టీ అధ్యక్ష పదవి కోసం సీనియర్లు మాణిక్యాల రావు - సోము వీర్రాజు వంటి వారు పోటీ పడ్డారు. వీరిలో మాణిక్యాలరావుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు కూడా లభించింది. ఇక సోము వీర్రాజు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులు అనే పేరు ఉంది. సోము వీర్రాజే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడని ఓ దశలో ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా కన్నా లక్ష్మీ నారాయణ పేరు వెలుగులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు.... తెలంగాణ పార్టీ నాయకులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారు.

భారతీయ జనతా పార్టీ చరిత్రలో కొత్త వారిని... అదీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడికి కీలకమైన అధ్యక్ష పదవి ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే పార్టీ పెద్దలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పటిష్టపడాలంటే పాత వారిని కాదని కొత్త వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్షుడిగా నియమించి ఐదారు నెలలు కావస్తున్నా ఆయన నుంచి అనకున్న... ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనను కలిసిన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

కన్నా లక్ష్మీనారాయణను నియమించే ముందు పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యల పై చర్చించినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో చంద్రబాబు నాయుడి కోసం బిజేపీ సీనియర్ నాయకులు పని చేశారని, దీంతో పార్టీ గురించి వారు పెద్దగా పట్టించుకోలేదని కమలనాథులు కన్నాకు వివరించారని సమాచారం. ఓ కులానికి చెందిన ఆ నాయకులు తమ వారికి పనులు చేయించుకునేందుకు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా పని చేశారని, దీంతో ఆంధ్రప్రదేశ్ లో మిగతా కులాల వారు పార్టీకి దూరమయ్యారని వారు కన్నాకు హితబోధ చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని అన్ని కులాలకు దగ్గర చేయాలని, ఇది తొలి రెండు, మూడు నెలల్లో జరగాలని టాస్క్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

అయితే, ఈ విషయంలో కన్నా లక్ష్మీనారాయణ వెనుకబడ్డారని చెబుతున్నారు. గడచిన నెల రోజులుగా మాత్రమే కన్నా లక్ష్మీ నారాయణ విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారని, అంతకు ముందు అది కూడా లేదని పార్టీ రాష్ట్ర నాయకులు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై రాజ్యసభ సభ్యుడు జీ.వీ.ఎల్. నరసింహారావు, సోము వీర్రాజు తప్ప కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడిన సందర్భాలు తక్కువేనని కూడా రాష్ట్ర నాయకుఫిరలు కమల దళపతికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు కలిసి ఏపీలో పార్టీ పరిస్థితిపవివరించినట్లు చెబుతున్నారు. ఈ నెల మూడో వారంలో ఢిల్లీకి రావాలని కన్నా లక్స్మీనారాయణకు పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు.