Begin typing your search above and press return to search.

మోడీపై మంత్రి కొడాలి నాని నోరుజారారా?

By:  Tupaki Desk   |   24 Sep 2020 5:30 PM GMT
మోడీపై మంత్రి కొడాలి నాని నోరుజారారా?
X
తాజాగా సీఎం జగన్ తో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొడాలి నాని మాటలు వివాదాస్పదమయ్యాయి. ప్రధాని మోడీ గురించి మాట్లాడిన కొడాలి నాని నోరు జారి చిక్కుల్లో పడ్డారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ప్రధాని మోడీపై ఏపీ మంత్రి కొడాలి నాని నోరుజారారు. శ్రీవారిని జగన్ తో పాటు దర్శించుకున్న మంత్రి నాని ‘బీజేపీ కింది స్థాయి నాయకుల వైఖరితోనే మోడీ బజారున పడుతున్నారని.. ముందు నరేంద్రమోడీని సతీసమేతంగా ఆలయాలకు రమ్మని’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో భూమి పూజ వేళ ప్రధాని నరేంద్రమోడీ సతీసమేతంగా రాకుండా భూమి పూజ చేశారనే కోణంలో నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాకే ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని నాని విమర్శించడం కమలనాథులకు కాక పుట్టించింది.

అందుకే ఈరోజు ఏపీ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రధాని నరేంద్రమోడీపై నోరుజారిన మంత్రి నాని క్షమాపణ చెప్పాలని.. లేకుంటే ఊరుకునేది లేదని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు ఏపీ వ్యాప్తంగా మంత్రి నాని వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు ఆందోళనలు పెద్ద ఎత్తున సాగాయి.

అయితే నిజానికి అయోధ్యలో భూమి పూజ మోడీ చేయలేదు. సతీసమేతంగా.. శాస్త్రోక్తంగా జరిగే ఈ తంతును వీహెచ్.పీ నేత సతీమేతంగా నిర్వహించారు. మోడీ కేవలం పక్కనే ఉండి వీక్షించారు. దివంగత వీహెచ్.పీ నేత అశోక్ సింఘాల్ తమ్ముడు సలిల్ సింఘాల్ ఆయన భార్య మధు సింఘాల్ ముఖ్య యజమానులుగా ఈ పూజ నిర్వహించారని బీజేపీ నేతలు ఫొటోలు చూపించి మరీ సోషల్ మీడియాలో మంత్రి నానికి కౌంటర్ ఇస్తున్నారు.. భూమి పూజ చేసేటప్పుడు భార్య సమేతంగా చేయాలి. అందుకే మోడీ ఇందులో ముఖ్య భూమిక పోషించకుండా... వీహెచ్.పీ నేత సలిల్ సింఘాల్ ఆయన భార్య మధు సింఘాల్ ముఖ్య యజమానులుగా శాస్త్రోక్తంగా ఈ భూమి పూజను నిర్వహించారని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

దీంతో ఈ ఫొటోలను చూపించి మోడీపై నోరుపారేసుకున్న మంత్రి కొడాలి నానికి బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు మోడీ అయోధ్య భూమి పూజ గురించి సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో మంత్రి నాని తీరును బీజేపీ నేతలు ఎండగడుతున్నారు.