Begin typing your search above and press return to search.

అన్నాడీఎంకే విలీనం వెనుక బీజేపీ స్వార్థం?

By:  Tupaki Desk   |   12 May 2017 10:35 AM GMT
అన్నాడీఎంకే విలీనం వెనుక బీజేపీ స్వార్థం?
X
త‌మిళ‌నాడులోని అధికార ఏఐఏడీఎంకే అంత‌ర్గ‌త రాజ‌కీయాలు అన్నివ‌ర్గాల్లోనూ ఆస‌క్తి రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో జయలలిత మరణంతో ఆ పార్టీలో జరిగిన అంతర్గత పరిణామాలు ఆ రాష్ట్రంలో అనిశ్చితికి కారణం అయ్యాయి. చిన్న‌మ్మ శ‌శిక‌ళ వర్గం నేత పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గం వేరు కుంపటి పెట్టిన విషయం విదితమే. బలాబలాల సమీకరణలో ఈ రెండు వర్గాలు ఇంకా పావులు కదుపుతూనే ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల‌ శిక్ష పడి శశికళ జైలుకు వెళ్లగా..పార్టీ గుర్తింపు విషయంలో ఎన్నికల అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో ఆమె మేనల్లుడు టిటివి దినకరన్‌ విచారణ ఎదుర్కొంటున్నారు. దీంతో, శశికళ వర్గాన్ని పార్టీ నుంచి బయటకు పంపితే విలీనానికి సిద్ధమంటూ పన్నీర్‌ వర్గం సంకేతాలివ్వగా..పళనివర్గం అందుకు చొరవ చూపకపోవడంతో అంతా మొదటికొచ్చింది. అయితే చీలిక వర్గాల మధ్య ఐక్యత సాధించే బాధ్యతను బీజేపీ తీసుకుందా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది.

రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీ కాలం ముగుస్తున్న నేప‌థ్యంలో జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి గెలుపు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఈ క్ర‌మంలో అన్నాడీఎంకేలోని ఇరు వర్గాల ఎమ్మెల్యేలు - ఎంపీల ఓట్ల కోసం బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా పన్నీర్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరించిన బీజేపీ..తాజాగా పళనివర్గాన్ని కూడా బుట్టలో వేసుకునేందుకు పావులు కదుపుతోందని స‌మాచారం. అందుకు ఆ రాష్ట్రంలో తమ పార్టీ ఉపాధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌ ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. పన్నీర్‌ వర్గం నుంచి వచ్చే బెదిరింపులకు తాము అడ్డుకట్ట వేయనున్నట్టు వనతి ద్వారా పళని వర్గానికి బీజేపీ అధిష్టానం సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై వనతి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలపై దృష్టి సారించాల్సిందిగా ముఖ్యమంత్రికి సూచిస్తున్నట్టు తెలిపారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో ప్రభుత్వానికి తాము సహకరిస్తామని ఆమె అన్నారు. కాగా, ప్రస్తుత అసెంబ్లీలోనూ బీజేపీకి ఒక్క స్థానం కూడా లేదు. అయితే ఆ పార్టీ ఎంపీ సీట్ల‌పై బీజేపీ ఆశ‌పెట్టుకుంది.

కాగా, తమిళనాడు అసెంబ్లీలో తాజా బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. ఏఐఏడీఎంకే పళనివర్గం-123 - పన్నీర్‌ వర్గం-12 - డీఎంకే-89 - కాంగ్రెస్‌-8 - ఐయూఎంఎల్‌-1 - ఖాళీ-1 - మొత్తం స్థానాలు-234. తమిళనాడు అసెంబ్లీకి గతేడాదే ఎన్నికలు జరిగినందున ఈ అసెంబ్లీకి ఇంకా నాలుగేళ్ల‌ సమయం ఉంది. ఈ నేప‌థ్యంలో మెజార్టీ సీట్లు అయిన ప‌ళ‌నివ‌ర్గాన్ని ద‌గ్గ‌ర చేసుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/