Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' మేకర్స్ పై బీజేపీ అధికార ప్రతినిధి తీవ్ర ఆగ్రహం...!

By:  Tupaki Desk   |   4 Oct 2022 7:27 AM GMT
ఆదిపురుష్ మేకర్స్ పై బీజేపీ అధికార ప్రతినిధి తీవ్ర ఆగ్రహం...!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. ఇది రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే దీనికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

'ఆదిపురుష్‌' సినిమాలో రాఘవగా ప్రభాస్ కనిపించనున్నారు. జానకిగా కృతిసనన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించారు. ప్రతినాయకుడు రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. అయితే టీజర్ రిలీజ్ అయిన తర్వాత.. ఇతిహాసం రామాయణాన్ని కించ పరిచేలా ఇందులో పాత్రల చిత్రీకరణ ఉందనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి.

'ఆదిపురుష్' టీజర్ లో రామాయణాన్ని తప్పుగా చూపించారని బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దర్శకుడు ఓం రౌత్ పురాణాలపై అధ్యయనం చేయకుండా ఈ సినిమా తీశాడని.. రావణుడి క్యారెక్టర్ ను తప్పుగా చూపించారని ఆరోపించారు. రావణుడి పాత్రకు లెదర్ జాకెట్ వేశారని.. కళ్లు కూడా నీలి రంగులో ఉండటాన్ని ఆమె తప్పుబట్టారు.

మాళవిక అవినాష్ మాట్లాడుతూ.. "ఈ విషయంలో చాలా బాధగా ఉంది. వాల్మీకి రామాయణం - తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర ఎలా ఉంటుందో డైరెక్టర్​ ఓం రౌత్ అధ్యయనం చేయలేదనుకుంటాను. కనీసం తెలుగు తమిళంలో ఇదివరకు వచ్చిన పౌరాణిక సినిమాల్లో రావణుడి పాత్ర ఎలా ఉందో పరిశీలించాల్సింది" అంటూ మండిపడ్డారు​.

'భూకైలాస' సినిమాలో ఎన్టీఆర్​ లేదా 'సంపూర్ణ రామాయణం' లో ఎస్వీ రంగారావు పోషించిన రావణుడి పాత్రను చూసి అర్థం చేసుకోవచ్చు. టీజర్​ లో రావణుడు నీలి కళ్లతో లెదర్​ జాకెట్​ వేసుకున్నట్లు చూపించారు.. స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదు. రామాయణం మన దేశ ప్రజల నాగరికతను కాపాడుతుంది. అలాంటి రామాయణం ఆధారంగా సినిమా తీస్తూ.. రావణుడి పాత్రను వక్రీకరించినందుకు చాలా బాధగా ఉంది అని మాళవిక అవినాష్ అన్నారు.

ఇక సోమవారం ఉదయం ఇదే విషయం మీద మాళవిక అవినాష్​ ట్వీట్​ చేశారు. "లంకకు చెందిన ఒక శివ-భక్త బ్రాహ్మణుడైన రావణుడు 64 కళలలో ప్రావీణ్యం సంపాదించాడు. వైకుంఠపాలకులైన జయ విజయల శాపం కారణంగా రావణుడిగా అవతరించాడు. అయితే ఆదిపురుష్​ లోని రావణుడు.. టర్కిష్ నిరంకుశుడిలా ఉన్నాడు. మన రామాయణం/చరిత్రను తప్పుగా చూపించడం ఆపండి. లెజెండ్ ఎన్​టీ రామారావు గురించి ఎప్పుడైనా విన్నారా?" అని అసహనం వ్యక్తం చేసింది. మరి దీనిపై 'ఆది పురుష్' టీమ్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.