Begin typing your search above and press return to search.

గుజరాత్ కోసం హిందూత్వను గెలుకుతున్న బీజేపీ

By:  Tupaki Desk   |   27 Nov 2022 12:30 AM GMT
గుజరాత్ కోసం హిందూత్వను గెలుకుతున్న బీజేపీ
X
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దల చూపంతా ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మీదనే ఉంది. అసలే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం. కాంగ్రెస్ ను ఎలాగోలా మట్టికరిపించి గెలిచేద్దాం అనుకుంటే.. పానకంలో పుడకలా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వచ్చిపడింది. దీనికితోడు ఆర్నెల్ల కిందటే పంజాబ్ లో ఆప్ చేతిలో చావు దెబ్బతిన్నది. ఆ ఉదంతాన్ని పట్టుకుని చూస్తే గుజరాత్ లో ఆప్ ఎవరి జాతకాలు తలకిందులు చేస్తుందో చెప్పలేం. పైగా ఆప్ సభలకు జనం స్పందన బాగుంటోంది. దీంతో గుజరాత్ ఎన్నికలు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అందుకని అన్ని అంశాలను, శక్తియుక్తులను వాడుకోవాలని చూస్తోంది.

కామన్ సివిల్ కోడ్ అంటూ దేశంలో ఎప్పటినుంచో చర్చకు ఉన్న అంశం కామన్ సివిల్ కోడ్. బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రం కూడా. కామన్ సివిల్ కోడ్ ఓ వర్గం వారికి ఇది ఏమాత్రం ఇష్టం లేని అంశం. అయితే, బీజేపీ దీనిని పట్టుకుని వేలాడుతోంది. అసోం సీఎం నుంచి హిమాచల్ సీఎం వరకు అందరూ ఇదే అంశంపై మాట్లాడుతుంటారు. కాగా, తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం కామన్ సివిల్ కోడ్ అంశాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అంతకుముందు కూడా ఇదే అంశాన్ని మరో ఇంటర్వ్యూలోనూ నొక్కిచెప్పారు.

ట్రంప్ కార్డు ను బయటకు తీస్తోంది గుజరాత్ లో బీజేపీ 1995 నుంచి అధికారం చెలాయిస్తోంది. అయితే, ఇన్నిసార్లు వరుసగా గెలవడం వెనుక 2002 నాటి గోద్రా అల్లర్ల ప్రభావం ఉంది. రైలు దహనం అనంతరం నాడు చెలరేగిన అల్లర్లు ప్రపంచవ్యాప్తంగానూ సంచలనంగా మారాయి. దీంతో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని తప్పుబట్టే పరిస్థితి వచ్చింది. కాగా, ఆ పరిస్థితులే మోదీని హిందూత్వ ప్రతినిధిగా మార్చాయి. 2002, 2007, 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ ను బీజేపీ చేజారకుండా చూశాయి. ఇందులో 2014 వరకు మోదీ గుజరాత్ సీఎం గా ఉన్నారు. గుజరాత్ మోడల్ అంటూ ప్రచారంతో ప్రధాని అయ్యారు.

మొదటి నుంచి అవే అడుగులు గుజరాత్ ఎన్నికలను బీజేపీ ఎంత ముందుచూపుతో తీసుకుందో పలు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. దారుణ ఉదంతమైన బిల్కిస్ బానో కేసు నిందితుల జైలు నుంచి విడుదల, వారిని సమర్థిస్తూ వ్యాఖ్యలు.. ఓ వర్గం ఓట్లను గుంపగుత్తగా దండుకునే ప్రయత్నమే. మరోవైపు గుజరాత్ కు ప్రధాని మోదీ వేల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చేలా చూశారు. అన్నిటికీ మించి ఇటీవల సంచలనంగా మారిన శ్రద్ధా వాకర్ దారుణ హత్యను పరోక్షంగా గుజరాత్ ఎన్నికలకు ట్రంప్ కార్డుగా వాడుకోజూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

స్మ్రతీ ఇరానీ మాటల అర్థం అదే? శ్రద్ధా వాకర్ దారుణ హత్యలో అందరూ గుర్తించని అంశం ఒకటుంది. శ్రద్ధా హిందువు కాగా, ఆమెను హత్య చేసిన సహ జీవన ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా ముస్లిం. ఓ దశలో ఇది 'లవ్ జిహాద్' అంటూ ప్రచారం జరిగింది. ఆ కోణంలో మాత్రం ముందుకెళ్లలేకపోయింది. కాగా, శ్రద్ధా హత్యను కేంద్ర మంత్రి స్ర్మతీ ఇరానీ లేవెనెత్తారు. ప్రేమిస్తే అంత దారుణంగా ముక్కలు చేస్తారా? అంటూ స్పందించారు. అంటే మున్ముందు దీనిని గుజరాత్ ఎన్నికల ప్రచారంలో శ్రద్ధా వాకర్ హత్యను వాడుకోచూస్తన్నట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.