Begin typing your search above and press return to search.

లేడీ ఫైర్ బ్రాండ్స్ కోసం మూడు పార్టీల వేట!

By:  Tupaki Desk   |   3 Nov 2022 2:30 AM GMT
లేడీ ఫైర్ బ్రాండ్స్  కోసం మూడు పార్టీల వేట!
X
మహిళలు రాజకీయాల్లోకి రావాలని అంతా అంటారు. కానీ వర్తమాన రాజకీయాలు చూస్తే మహిళలు రాజకీయాల్లోకి రావడానికే జంకే సీన్ ఉంది. ఎందుకంటే రాజకీయ విమర్శలు కూడా హద్దులు దాటేస్తున్నాయి. వ్యక్తిగతంగా ముందుకు పోతున్నారు. అదే విధంగా ఫ్యామిలీస్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఉండాల్సిన కనీస సూత్రాలను కూడా మరచిపోతున్నారు. ఈ నేపధ్యంలో మహిళలు రాజకీయాలు అంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.

ఇక విపక్షంలో ఉంటూ రాజకీయాలు చేయడానికి కూడా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అయితే ఏపీలో చూసుకుంటే ఫైర్ బ్రాండ్ లేడీ పొలిటీషియన్లు చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా కావాల్సి ఉంది అంటున్నారు. అధికార వైసీపీలో మహిళా నాయకురాళ్ళు చాలా మంది ఉన్నారు. జిల్లాల్లో కూడా అనేకమంది ఉన్నారు. వైసీపీలో జగన్ తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాల వల్ల మహిళా కోటా గట్టిగా అమలు జరిగి కొత్త వారు వచ్చారు.

పైగా అధికార పార్టీ కావడంతో అవకాశాలు కూడా అందుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. అదే టీడీపీలో చూసుకుంటే తక్కువ మంది మాత్రమే పార్టీ తరఫున గొంతు విప్పుతున్నారు. మంత్రులుగా పనిచేసిన పీతల సుజాత, పరిటాల సునీత వంటి వారు పెద్దగా నోరు విప్పడం లేదు. ఇక తెలుగు మహిళా అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత డేరింగ్ గానే ఉంటారు. అలాగే ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ కూడా ఇటీవల కాలంలో తన వాయిస్ బలంగా వినిపిస్తున్నారు.

మరో వైపు చూస్తే గౌతు ఫ్యామిలీ నుంచి రాజకీయ వారసురాలిగా వచ్చిన శిరీష కూడా ధీటైన నేతగా గుర్తింపు పొందారు విజయవాడ దాకా వస్తే పంచుమర్తి అనూరాధ బలమైన గొంతుకతో పార్టీ స్టాండ్ ని చాటుతారు. అయితే ఈ ముగ్గురు నలుగురు అయితే సరిపోరని టీడీపీ భావిస్తోంది. పైగా వచ్చేది ఎన్నికల కాలం, అధికార పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్లను ఎదుర్కోవాలంటే చాలా ఎక్కువ మందే అవసరం అని అధినాయకత్వం భావిస్తోందిట.

అందుకోసం వేట అయితే మొదలెట్టారు అని అంటున్నారు. ఈ విషయం చూడాలని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. మరో వైపు జనసేనలో కూడా మహిళా గొంతుకలు కొన్ని అవసరం అని అంటున్నారు. ఈ మధ్యనే ఒక మహిళా నాయకురాలికి ప్రమోషన్ ఇస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలను పవన్ కళ్యాణ్ ఇచ్చారు.

2019 ఎన్నికల ముందు వీర మహిళలు అని ఒక వింగ్ ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది దాకా రిక్రూట్ చేసే ఇపుడు ఇరవై మంది మాత్రమే మిగిలారట. దాంతో ప్రతీ జిల్లాలో కనీసంగా ఇరవైకి తక్కువ కాకుండా వీర మహిళలను తీసుకుని పార్టీలో నారీ భేరీ మోగించాలని పవన్ నుంచి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు.

ఇక బీజేపీలో చూసుకున్నా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఒక్కరే మహిళా నాయకురాలిగా ప్రొజెక్ట్ అవుతున్నారు. ఆ పార్టీలో కూడా గతంలో తిరుపతికి చెందిన శాంతారెడ్డి వంటి సీనియర్ మహిళా నాయకురాళ్ళు చాలా మంది ఉండేవారు. ఇపుడు ఎందుకో కొందరు మహిళా నేతలు రాజకీయాల పట్ల ఆసక్తిని చూపడంలేదు. 2021లో తిరుపతి ఉప ఎన్నిక జరిగితే రత్న ప్రభను అభ్యర్ధిగా పెట్టారు. ఆమె ఓడిన తరువాత కనిపించడంలేదు. మొత్తానికి చూస్తే బీజేపీ కూడా మహిళా నాయకురాళ్ళను రిక్రూట్ చేసుకోవాల్సిందే అంటున్నారు. ఇలా మూడు పార్టీలూ ఫైర్ బ్రాండ్ మహిళల కోసం చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.