Begin typing your search above and press return to search.

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల హోరు

By:  Tupaki Desk   |   26 July 2015 4:59 AM GMT
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల హోరు
X
బీహార్ అసెంబ్లీ ఎన్నికల హోరు మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా అధికారాన్ని చేజిక్కించుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి. మొన్నటి వరకూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ.. జనతాదళ్ వేరు కుంపట్లు పెట్టుకోవటం.. శరద్ యాదవ్.. యులాయింసింగ్ యాదవ్.. లాలూ ప్రసాద్ లాంటి నేతలంతా కలిసి జనతాపరివార్ పేరిట ఒక కూటమి ఏర్పాటు చేయటం.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ ను ఎంపిక చేసుకోవటం తెలిసిందే. ఈ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

మరోవైపు బీజేపీ తనతో కలిసి వచ్చే మిత్రులతో కలిసి బీహార్ లో పోరాటం చేయాలని.. ప్రభుత్వ ఏర్పటుకు 160 అసెంబ్లీ సీట్ల సాధనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాల్ని పొందేందుకు వీలుగా 160 బస్సులతో ప్రచారాన్ని నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

160 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించాలన్న లక్ష్యంతో 160 బస్సుల్ని ప్రచార రథాలుగా రూపొందించి తిప్పుతున్నారు. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. తన రాజకీయ కెరీర్ కు ఒక పరీక్షగా మారిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లాలూ.. వెయ్యి గుర్రపు బగ్గీలను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. భారీ సంఖ్యలోని గుర్రపు బగ్గీలతో వినూత్నంగా ప్రచారం చేపడతామని లాలూ చెబుతున్నారు. బస్సులతో పోలిస్తే నెమ్మదిగా ప్రయాణిస్తాయని.. కానీ.. అంతిమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానానికి చేరుకుంటాయని ఆయన వ్యాఖ్యనిస్తున్నారు.

మరోవైపు.. ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నితీశ్ కుమార్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎత్తున సైకిళ్లను వినియోగించాలని భావిస్తున్నారు. ఇలా ఎవరికి వారు.. ఎన్నికల ప్రచారానికి తమదైన శైలిలో ముందుకు పోతున్న నేపథ్యంలో.. బీహార్ ఎన్నికలు మరింత రసకందాయంలో పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.