Begin typing your search above and press return to search.

కర్ణాటక డిప్యూటీ సీఎంగా తెలుగోడు.!

By:  Tupaki Desk   |   3 Aug 2019 5:52 AM GMT
కర్ణాటక డిప్యూటీ సీఎంగా తెలుగోడు.!
X
కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు పదవుల పందేరం పైనే ఎమ్మెల్యేలంతా ఆశలు పెంచుకున్నారు. కొత్త సీఎంగా బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ఒక్కరే బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీలో బలనిరూపణ కూడా చేసుకున్నారు. అనంతరం గప్ చుప్ గా హైదరాబాద్ వచ్చి చిన్నజీయర్ స్వామి సన్నిధిలో యడ్డీ పూజలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారు. ఇక్కడ యడ్యూరప్ప ప్రశాంత చిత్తంతో ఉంటే అక్కడ కర్ణాటకలో మాత్రం మంత్రి పదవులపై ఆశావహులు బోలెడు ఆశలు పెంచుకున్నారు..

తాజాగా మంత్రి పదవులు ఎవరికి వస్తాయో.. ఎవరికి రావో అన్న ఉత్కంఠ మాత్రం ఊపేస్తోంది. అయితే బీజేపీ ప్రభుత్వానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండి బళ్లారి కేంద్రంగా మైనింగ్ నడిపిన మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు కన్నడ సీఎం అయిన యడ్యూరప్పకు అనుంగ శిష్యుడు. గాలి అనుచరుడైన బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములుకు ఇప్పుడు డిప్యూటీ సీఎం దక్కబోతుందన్న చర్చ కన్నడలో విస్తృతంగా సాగుతోంది. బళ్లారి నగరంలో మీడియాతో మాట్లాడిన శ్రీరాములు.. ‘తనకు, బీజేపీ కార్యకర్తలకు యడ్యూరప్ప సీఎం కావాలనేదే ఆశ అని..మంత్రివర్గ విస్తరణలో డిప్యూటీ సీఎం ఎవరు అవుతారనే విషయంపై తాను ఆలోచించడం లేదని’ స్పష్టం చేశారు. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.

అయితే యడ్యూరప్పకు, బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచే గాలి జనార్ధన్ వర్గానికి డిప్యూటీ సీఎం పోస్టు ఖాయమనే ప్రచారం కన్నడలో సాగుతోంది. గాలి ప్రధాన అనుచరుడైన బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుకే ఈ అదృష్టం దక్కబోతోందని.. సీఎం యడ్డీ తన కేబినెట్ లో శ్రీరాములును డిప్యూటీ సీఎం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కాగా బి. శ్రీరాములు తెలుగువాడే. ఈయన కుటుంబం చాలా ఏళ్ల క్రితమే రాయలసీమ నుంచి కర్ణాటకలోని బళ్లారికి వలస వెళ్లింది. గాలి, శ్రీరాములు ఇద్దరు తెలుగు మూలాలు గల వ్యక్తులు కావడం.. ఇప్పుడు కన్నడ ప్రభుత్వంలో కీరోల్ పోషిస్తుండడం విశేషం.