Begin typing your search above and press return to search.

బండి 2.0 పాద‌యాత్ర ప్రారంభం.. ఈ ద‌ఫా ఎన్ని రోజులంటే!

By:  Tupaki Desk   |   15 April 2022 2:18 AM GMT
బండి 2.0 పాద‌యాత్ర ప్రారంభం.. ఈ ద‌ఫా ఎన్ని రోజులంటే!
X
తెలంగాణ‌లోని సీఎం కేసీఆర్ స‌ర్కారు వైఫల్యాలు ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన రెండోదశ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభమైంది. తొలిరోజు అలంపూర్ నుంచి ఇమామ్‌పూర్ వరకు 4 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 10 నియోజకవర్గాల పరిధిలో 105 గ్రామాల్లో కొనసాగనున్న యాత్రను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌ అలంపూర్‌లో ప్రారంభించారు.

ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో బండి సంజయ్‌ జోగులాంబ ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలంపూర్‌ చేరుకున్న తర్వాత అంబేడ్కర్‌ విగ్రహానికి సంజయ్‌ నివాళులర్పించారు.

అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. సభ తర్వాత రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ నుంచి ఇమాన్‌పూర్ వరకు ఇవాళ బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతుంది. ఇమాన్‌పూర్‌లో బండి సంజయ్‌ రాత్రి బస చేయనున్నారు.

రాత్రి బండి సంజయ్‌ బస చేసే ప్రాంతానికి వెళ్లనున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. అక్కడే శిబిరంలో వారితో కలిసి భోజనం చేయనున్నారు. పాదయాత్ర శిబిరంలోనే ఇవాళ రాత్రి బస చేయనున్న కిషన్‌ రెడ్డి.. శుక్రవారం ఉదయం సంజయ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు.

రెండో విడత పాదయాత్ర 31 రోజులపాటు కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో యాత్ర కొనసాగించి, మధ్యాహ్న సమయంలో పార్టీ రాష్ట్రస్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు.

మొత్తం 387 కి.మీ దూరం సాగే కార్యక్రమం.. మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముగుస్తుంది. ఇక‌, యాత్ర‌లో మేళ‌తాళాలు.. డీజే స్టెప్పులు ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం.