Begin typing your search above and press return to search.

బ్లూఫిల్మ్స్ నేతలకు మంత్రి పదవులు..ఇరకాటంలో కమలం!

By:  Tupaki Desk   |   28 Aug 2019 8:33 AM GMT
బ్లూఫిల్మ్స్ నేతలకు మంత్రి పదవులు..ఇరకాటంలో కమలం!
X
సాక్షాత్ అసెంబ్లీలో నీలిచిత్రాలు చూస్తూ దొరికిపోయిన ముగ్గురు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల్లో..ఇప్పుడు ఇద్దరు యడియూరప్ప కేబినెట్లో స్థానం పొందడం తీవ్రవివాదంగా మారుతూ ఉంది. ఒకప్పుడు వారి తీరును బీజేపీ కూడా సమర్థించలేకపోయింది. వారి చేత నాటి ముఖ్యమంత్రి సదానందగౌడ స్వయంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించారు. అసెంబ్లీలో వాడీవేడీ చర్చ సాగుతున్న తరుణంలో నీలిచిత్రాలు చూసి కెమెరాలకు చిక్కిన వాళ్ల చేత రాజీనామా చేయించారు.

వాళ్లలో సీసీ పాటిల్ - లక్ష్మణ్ అనే ఇద్దరు నేతలు ఇప్పుడు యడియూరప్ప కేబినెట్ లో చోటు సంపాదించారు. వీరిలో లక్ష్మణ్ అనే నేత అయితే కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యేగా మిగిలారు. అయితే ఆయనకు మంత్రి పదవిని ఇచ్చి - ఏకంగా డిప్యూటీ సీఎం హోదాను కూడా ఇచ్చారు!

తీవ్ర వివాదంలో చిక్కుకుని - పార్టీ పరువు తీసి.. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన వ్యక్తికి ఇప్పుడు యడియూరప్ప ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం వివాదం గాక మరేం అవుతుంది? అలాగే అప్పుడు పక్క పక్కనే కూర్చుని నీలిచిత్రాలను ఆస్వాదించిన సీసీ పాటిల్ కూడా ఇప్పుడు మంత్రి అయిపోయారు.

ఈ అంశంపై సోషల్ మీడియా లో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అసెంబ్లీలో కూర్చుని బ్లూ ఫిలింలు చూసిన వాళ్లు ఉప ముఖ్యమంత్రి - మంత్రి కావడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో స్వయంగా బీజేపీలో కూడా అసహనం కనిపిస్తూ ఉంది.

మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు.. ఈ అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని - త్యాగాలు చేసిన వారిని పక్కన పెట్టి అలా నీలిచిత్రాల ఘనులకు పదవులు ఇవ్వడం ఏమిటంటూ కమలం పార్టీలోనే అసహనం వ్యక్తం అవుతూ ఉంది. అయితే ఇంత జరుగుతున్నా యడియూరప్ప మాత్రం నిమ్మకునీరెత్తినట్టుగా ఉన్నారు. తన చేతిలో ఏం లేదని అంతా అధిష్టానం చెప్పినట్టే అంటూ ఆయన తప్పించుకుంటున్నారని సమాచారం!