Begin typing your search above and press return to search.

వెంకయ్య తర్వాత గుర్తింపు ఆనందం సరే.. ఆయనలా అవ్వొద్దు లక్ష్మణ్ జీ

By:  Tupaki Desk   |   18 Aug 2022 1:29 PM GMT
వెంకయ్య తర్వాత గుర్తింపు ఆనందం సరే.. ఆయనలా అవ్వొద్దు లక్ష్మణ్ జీ
X
ఆయనేం మాస్ నాయకుడు కాదు. ఆయన బయటకు వచ్చి మైకు ముందుకు వస్తే.. అంతంతమాత్రంగా మాత్రమే వచ్చే జనాలు. అయితే.. పార్టీకి హార్డ్ కోర్ విధేయుడిగా.. కార్యకర్తగా అనుక్షణం శ్రమించే తత్త్వం మెండుగా ఉన్న బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్. సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలై.. బీజేపీ అత్యున్నత కమిటీలో సభ్యుడిగా ఎంపికైన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ పాటిల్ లాంటి వారిని బయటకు పంపేసిన వేళ.. వారి స్థానంలో తీసుకున్న సభ్యుల్లో లక్ష్మణ్ ఒకరు కావటం విశేషం. తెలుగు రాష్ట్రాల నేతలకు బీజేపీలో ప్రాధాన్యతను పెంచేసే సంకేతాల్ని ఇచ్చేలా ఈ మధ్యన నిర్ణయాలు ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ విషయానికే వస్తే.. మొన్నీ మధ్యనే ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. అది సరిపోదన్నట్లుగా తాజాగా ఆయన్ను బీజేపీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి పార్లమెంటు బోర్డులోస్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ నుంచి తొలిసారి నేరుగా ప్రాతినిధ్యం లభించింది ఆయనకే. తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే.. వెంకయ్య నాయుడు తర్వాత ఆయనకే లభించింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన లక్ష్మణ్.. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. వెంకయ్య తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీలో అలాంటి గుర్తింపు లభించింది తనకే అన్న విషయాన్ని ఆయన చెప్పుకున్నారు. నిజానికి గడిచిన రెండేళ్లుగా ఆయన దశ.. బీజేపీలో తిరిగిపోయింది.

2020 అక్టోబరులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఆయన్ను నియమించిన అధిష్ఠానం ఆయనకు వరుస పెట్టి పదువుల్ని కట్టబెడుతోంది. తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయన్ను బోర్డులోకి తీసుకోవటం ద్వారా.. పార్టీలో తెలంగాణకు ఇచ్చే ప్రాధాన్యతను చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఇంతకీ ఆ బోర్డులో ఎవరుంటారన్న విషయానికి వస్తే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్.. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లతో పాటు తాజాగా తీసుకున్న కొత్త సభ్యుల్లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప.. డాక్టర్ లక్ష్మణ్.. సర్బానంద సోనో హర్.. ఇక్బాల్ సింగ్.. సత్యనారాయణ్ జటియా.. సుధా యాదవ్ ల ఉన్నారు.

ఇప్పటివరకు ఈ బోర్డులో ఏడుగురు మాత్రమే సభ్యులు ఉండగా.. ఇప్పుడు దీన్ని పదకొండు మందికి పెంచటం గమనార్హం. తనకు లభించిన అవకాశానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న లక్ష్మణ్.. దాన్ని దాచుకోకుండా బయటకు చెబుతున్నారు. అయితే..ఆయన మర్చిపోతున్న విషయం ఏమంటే.. తనకు అంత ఇమేజ్ లేకపోవటం.. పెద్దగా ప్రచారం కూడా ఉండకపోవటం లాంటి అంశాలే తనకు కలిసి వస్తున్నాయన్న విషయాన్ని ఆయన మర్చిపోకూడదు.

తనకు లభించిన అవకాశాలతోమిగిలిన వారి కంటే ఎక్కువగా ప్రచారం షురూ చేసినా.. తనకంటే ఇమేజ్ ను పెంచుకుంటున్నా.. ఇప్పటివరకు పెంచిన దాన్ని నిర్దాక్షిణ్యంగా తుంచేయటం మోడీషాలకు బాగా తెలుసన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. వెంకయ్యతో పోల్చుకొని సంబరపడటం వరకు ఓకే అయినా.. ఆయన మాదిరి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి పదవితో సరిపెట్టుకున్న పరిస్థితి తనకు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే లక్ష్మణ్ జీ అసలుసిసలు విజయంగా చెప్పుకోవచ్చు.