Begin typing your search above and press return to search.

ఇంద్రసేనుడు కన్నేస్తే కోర్టు చిక్కులు తప్పవా?

By:  Tupaki Desk   |   9 Oct 2017 8:10 AM GMT
ఇంద్రసేనుడు కన్నేస్తే కోర్టు చిక్కులు తప్పవా?
X
తెలంగాణలో జోనల్ వ్యవస్థ విషయం అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి కొత్తగా ఒక కమిటీని వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలుసు. అయితే జోనల్ వ్యవస్థను కొనసాగిస్తూ.. జిల్లాలు పెరిగిన నేపథ్యంలో మరిన్ని జోన్లు ఉండేలా.. చేస్తాం అని కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల వెనుకబడ్డ ప్రాంతాలకు ఎక్కువ న్యాయం జరుగుతుంది అనేది ఆయన మాట. తెలంగాణ యువతరానికి చాలా మేలు చేస్తున్నట్లుగా ఆయన ఈ జోనల్ వ్యవస్థకు కమిటీ వేయడాన్ని గురించి చెప్పుకొచ్చారు. కానీ.. తెలంగాణ భాజపా సీనియర్ నాయకుడు.. ఏ విషయం మీదనైనా విశ్లేషణాత్మకంగా మాట్లాడే అలవాటు ఉన్న ఇంద్రసేనారెడ్డి.. కేసీఆర్ ఆలోచనను తప్పు పడుతున్నారు. గతంలో జోనల్ వ్యవస్థను రద్దు చేసిన కేసీఆర్... ఇప్పుడు మళ్లీ ప్రత్యేక కమిటీ అంటూ మాటలు వల్లించడం అనాలోచిత నిర్ణయం అని ఆయన చెబుతున్నారు.

ఇంద్రసేనా రెడ్డి అంటే.. చాలా కచ్చితత్వంతో కూడిన విమర్శలు చేసే నాయకుడిగా పేరుంది. పైగా తాను లేవనెత్తిన అంశాల మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించి అయినా.. తాను తప్పన్నది తప్పేనని నిరూపించే తెగువ అలవాటు ఉన్న నాయకుడు ఇంద్రసేనారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఆయన వివిధ అంశాలపై న్యాయస్థానంలో పిటిషన్లు వేసి విజయం సాధించారు. కేబినెట్ మంత్రి హోదాతో సలహాదార్ల ను నియమించిన అంశంపై గానీ... అలాగే ప్రభుత్వానికి సంబంధించింది కాకపోయినా.. సినీ నటులు మోహన్ బాబు - బ్రహ్మానందం తమ పేర్ల ముందు పద్మశ్రీ పురస్కారాన్ని వాడుకోవడం గురించి గానీ.. కోర్టులో పిటిషన్లు వేసి విజయం సాధించింది ఇంద్రసేనా రెడ్డి అన్న సంగతి మరచిపోకూడదు.

ఇప్పుడు కేసీఆర్ ... జోన్ల వ్యవస్థ పై కమిటీ ఏర్పాటు చేయడం అనాలోచిత - లోపభూయిష్ట నిర్ణయం అని ఇంద్రసేనారెడ్డి అంటున్నారంటే.. ముందు ముందు ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు కూడా ప్రభుత్వానికి తప్పకపోవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు. జోన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ముందు వెనకలుగా రకరకాలుగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారం కోర్టు గడప తొక్కిందంటే గనుక.. ప్రతి అంశానికీ ప్రభుత్వం జవాబుదారీ తనం వ్యవహరించాల్సి వస్తుంది. గతంలో జోన్ల వ్యవస్థను ఎందుకు రద్దు చేశారో.. అప్పట్లో అది అనవసరం అని వారికి ఎందుకు అనిపించిందో.. ఇప్పుడు జోన్లను ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారో.. ఏ రకంగా జోన్లు పెంచడాన్ని సమర్థించుకుంటారో అన్నిటికీ వారు న్యాయస్థానానికి జవాబు చెప్పాలి. ఏ రకంగా చూసినా.. ఇంద్రసేనారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాడంటే ప్రభుత్వానికి చిక్కులు తప్పవని పలువురు భావిస్తున్నారు.