Begin typing your search above and press return to search.

కేసీఆర్‌...దమ్ముంటే మూసీ నీళ్లు తాగు

By:  Tupaki Desk   |   14 July 2017 7:07 AM GMT
కేసీఆర్‌...దమ్ముంటే మూసీ నీళ్లు తాగు
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్ర‌మైన స‌వాల్ ఎదురైంది. ఇటీవ‌ల సీఎం కేసీఆర్‌ ను ఇర‌కాటంలో ప‌డేసేలా బీజేపీ నేత‌లు ప‌లు స‌మ‌స్య‌ల‌పై దూకుడుగా స్పందిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు భూదాన్‌ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో బిజెపి ఆధ్వర్యంలో మూసీపై రైతు పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు. మూసీ నది బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మురళీధర్‌ రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్ రాష్ట్రాన్ని బాధల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళన జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

రాజధానిలో విస్తరించిన కొన్ని పరిశ్రమలు హానికరమైన వ్యర్ధాలను మూసీలో వదులుతున్నాయని ముర‌ళీధ‌ర్ రావు ఆరోపించారు. దీంతో పండిన పంట సరైన దిగుబడి రాకపోవడం, ప్రజలు, మూగ జీవాలకు వింత వ్యాధులు సంభవించడం, చేపలు చనిపోయి మత్య్స కార్మికులు నష్టపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది ప్రక్షాళన చేస్తేనే కేసీఆర్ హీరో అని, లేదంటే జీరోనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే కలుషితమైన మూసీ నీళ్లు తాగి అసెంబ్లీకి వెళ్లాలని ముర‌ళీధ‌ర్ రావు సవాల్ చేశారు. మూసీ నది ఏడు జిల్లాల్లో విస్తరించి ఉందని, మూసీలో 9 రోజుల పాటు ముఖ్యమంత్రి ముఖం కడుక్కోవాలని, లేదంటే రాజకీయాలను విడిచిపెట్టాలని ఆయన సవాల్ చేశారు. కేసీఆర్ చేయ‌లేని పక్షంలో మూసీ నది ప్రక్షాళన చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. సామాన్యులకు మౌలికమైన అధికారాలున్నాయని, మానవ మనుగడకు నీరే జీవనాధారమని, జీవించే అధికారానికి ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదన్నారు. తెలంగాణలో చరిత్రను మలుపుతిప్పేది రైతు పంచాయతీ కార్యక్రమమని ఆయన కొనియాడారు. మూసీ నది ప్రక్షాళన కోసం అందరూ ఉద్యమించాలని ముర‌ళీధ‌ర్ రావు పిలుపునిచ్చారు.