Begin typing your search above and press return to search.

బీజేపీలోకి ర‌జ‌నీకి ఆహ్వానం..సూప‌ర్‌ స్టార్ దారెటో..!

By:  Tupaki Desk   |   23 Oct 2019 3:52 PM GMT
బీజేపీలోకి ర‌జ‌నీకి ఆహ్వానం..సూప‌ర్‌ స్టార్ దారెటో..!
X
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగ్రేటం ఎలా ఉంటుంది అన్నది గత 3-4 సంవత్సరాలుగా పెద్ద సస్పెన్స్‌ గా మారింది. 2014 లోక్‌ స‌భ ఎన్నికల ముందు నుంచే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తునాయి. ఆ టైంలోనే మోడీ రజనీకాంత్ ను కలిసి బీజేపీ లోకి రావాలని ఆహ్వానించారు. మోడీ ఆహ్వానంపై ఎటు స్పందించని రజిని మౌనంగా ఉండిపోయారు. ఇక గత రెండేళ్లుగా రజిని కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రజిని కొత్తపార్టీపై ఎన్ని వార్తలు వచ్చినా ఆయన మాత్రం మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈ ఏడాది జరిగిన లోక్‌ స‌భ ఎన్నికలకు ముందు సైతం బిజెపి రజనీకి ఆహ్వానం పంపడంతో పాటు రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చింది.

అయినా ఆయన మౌనం గా ఉండడంతో బిజెపి రజినీని లైట్ తీసుకుంది. గత నాలుగు సంవత్సరాలుగా సౌత్ ఇండియాలో పార్టీని బలోపేతం చేసేందుకు బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక - కేరళ - త‌మిళ‌నాడుపై బిజెపి జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే బిజెపికి ముందు నుంచి తమిళనాడు కొర‌క‌రాని కొయ్య‌గా మారింది. జాతీయ పార్టీలను అంత సులువుగా అంగీకరించని త‌మిళ‌ ప్రజలు బీజేపీకి ఈ ఎన్నికల్లో పెద్ద షాక్ ఇచ్చారు. దీంతో మ‌రోసారి బీజేపీ ర‌జ‌నీపై వ‌లవేసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

రజనీకాంత్‌ బీజేపీలో చేరాలని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొన్‌.రాధాకృష్ణన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన పుదుకోటలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. త‌మిళ రాజ‌కీయాల్లో బీజేపీ స‌త్తా చాటాలంటే అందుకు ర‌జ‌నీ అవ‌స‌రం ఎంతో ఉంద‌న్న విష‌యం కూడా ఆయ‌న తెలిపారు. రజనీకాంత్‌ పార్టీని ప్రారంభిస్తే తాను మనసారా స్వాగతిస్తానని - అయితే పార్టీని ప్రారంభించడం కంటే ఆయన బీజేపీలో చేరితే చాలా మంచిదని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం భావిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

ర‌జ‌నీకాంత్ బీజేపీలో చేరితే ఆయ‌న ఎంతో ప్ర‌యార్టీ ఉంటుంద‌న్న విష‌యం కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మ‌రి ర‌జ‌నీ ఇప్ప‌టికే జీవిత ప‌రంగా కూడా చ‌ర‌మాంక‌ద‌శ‌లో ఉన్నారు. ఇలాంటి టైంలో ఆయ‌న కొత్త పార్టీ పెడ‌తారా ? లేదా బీజేపీలో చేరే ఆలోచ‌న చేస్తారా ? అన్నదానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. ఇక త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం బీజేపీ జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత అనాధ‌లా మారిన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో నాంగునేరి - విక్రవాండి నియోజకవర్గాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ అన్నాడీఎంకే అభ్య‌ర్థుల‌కే బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చింది.