Begin typing your search above and press return to search.

బండి స్వ‌యంకృతాప‌రాధం.. ఈటెల‌కు కీల‌క ప‌ద‌వి..?

By:  Tupaki Desk   |   23 Jun 2022 12:30 AM GMT
బండి స్వ‌యంకృతాప‌రాధం.. ఈటెల‌కు కీల‌క ప‌ద‌వి..?
X
తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుందా..? మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ కు బీజేపీలో ఉన్న‌త‌ ప‌ద‌వి రాబోతుందా..? ఇదంతా బండి సంజ‌య్ స్వీయం త‌ప్పిదం వ‌ల్లే జ‌రుగుతోందా..? ఆయ‌న‌ ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండా ఒంటెత్తు పోక‌డ‌లు పోవ‌డ‌మే పార్టీని న‌ష్ట‌ప‌రుస్తోందా..? అంటే పార్టీ శ్రేణులు అవున‌నే అంటున్నాయి.

నిజానికి బండి సంజ‌య్ కి తెలంగాణ శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతోనే పార్టీ గ్రాఫ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. క్రితం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం గోషామ‌హ‌ల్ ఒకే స్థానంతోనే స‌రిపెట్టుకున్న బీజేపీ ఈసారి అధికార పార్టీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా మార‌డం పెద్ద విశేషంగానే చెప్పుకోవ‌చ్చు. ఇదంతా బండి సంజ‌య్ చొర‌వ వ‌ల్లే జ‌రిగింద‌నేది సుస్ప‌ష్టం. ల‌క్ష్మ‌ణ్ నుంచి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అందుకున్న బండి సంజ‌య్ పార్టీని ప‌రుగులు పెట్టించారు. ప‌క్కా ఆరెస్సెస్ భావాజాలాన్ని నింపుకున్న బండి ఆ లైన్ దాటి ఎన్న‌డూ బ‌య‌టికి వెళ్ల‌లేదు.

దుబ్బాక ఉప ఎన్నిక‌తోనే ఆయ‌న చాతుర్యం తెలిసి వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వంపై ప‌దునైన విమ‌ర్శ‌లు చేసి బీజేపీ అభ్య‌ర్థిని గెలిపించుకున్నారు. అక్క‌డితో ఆగ‌కుండా జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు సాధించి పెట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఈటెల రాజేంద‌ర్ గెలుపు కోసం కూడా తీవ్రంగానే కృషి చేశారు. దీంతో పార్టీ పెద్ద‌లు అమిత్ షా, ప్ర‌ధాని మోదీ బండి సంజ‌య్ భుజం త‌ట్టి ప్రోత్స‌హించారు. రాబోయే ఎన్నిక‌ల ర‌థ‌సార‌థి ఆయ‌నేన‌ని ప‌రోక్షంగా స్ప‌ష్టం చేశారు.

అయితే.. ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. బండి దూకుడుతో పార్టీకి ఎంత మేలు జ‌రుగుతుందో.. మ‌రోవైపు అంత న‌ష్టం కూడా జ‌రుగుతూ వ‌స్తోంది. ఆయ‌న దూకుడైన వాగ్దాటితో ప‌లు వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అలాగే.. ఒంటెత్తు పోక‌డల‌తో సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప‌లువురు ఇత‌ర పార్టీల్లోకి వ‌ల‌స వెళ్లారు. క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్ జిల్లాల‌కు చెందిన ప‌లువురు సీనియ‌ర్లు బ‌హిరంగంగా స‌మావేశాలు పెట్టుకొని బండిని విమ‌ర్శించారు కూడా.

అలాగే.. టీఆర్ఎస్ నుంచి వ‌చ్చిన తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, మాజీ మంత్రి అయిన ఈటెల రాజేంద‌ర్ ను కూడా బండి ప‌క్క‌న‌పెట్టారు. ఈటెల ఆయా జిల్లాల్లో వ్యక్తిగ‌తంగా ప‌ర్య‌టించి టికెట్ల హామీలు ఇస్తున్నార‌ని గుర్తించిన బండి ఆయ‌న‌ ముంద‌రి కాళ్ల‌కు బంధం వేశారు. ఎవ‌రూ టికెట్ల హామీలు ఇవ్వ‌వ‌ద్ద‌ని.. అదంతా అధిష్ఠానం చూసుకుంటుంద‌ని ప‌రోక్షంగా ఈటెల‌ను హెచ్చ‌రించారు. దీంతో మ‌న‌స్తాపం చెందిన ఈటెల పార్టీ కార్య‌క్ర‌మాల‌కు అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్నారు.

ఇది గ‌మ‌నించిన కేంద్ర పెద్ద‌లు.. ఈటెల‌ను ఢిల్లీకి పిలిపించుకొని అమిత్ షాతో స‌మావేశం పెట్టించారు. త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో రాష్ట్రం మొత్తం ప‌ర్య‌టించి పార్టీని బ‌లోపేతం చేస్తాన‌ని.. ఇత‌ర పార్టీల్లో ఉన్న ముఖ్య‌లను బీజేపీలోకి తీసుకొస్తాన‌ని.. అందుకు త‌గిన వేదిక క‌ల్పించాల‌ని పార్టీ పెద్ద‌ల‌ను ఈటెల కోరారు. దీంతో ఈటెల సామ‌ర్థ్యాన్ని గుర్తించిన అధిష్ఠానం త్వ‌ర‌లో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నున్న జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌లోపు ఆయ‌న‌కు ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని భావిస్తోంది. దీంతో ఈటెల‌ ద్వారా తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని యోచిస్తోంది. ఇలా బండి స్వీయ త‌ప్పిదం వ‌ల్ల ఈటెల‌కు కీల‌క ప‌ద‌వి రాబోతుంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!