Begin typing your search above and press return to search.

రామ‌రాజ్యం క‌న్నా.. రావ‌ణ రాజ్య‌మే బెట‌ర్‌.. బీజేపీ నేత పోస్టు వైర‌ల్‌!

By:  Tupaki Desk   |   2 Feb 2021 9:50 AM GMT
రామ‌రాజ్యం క‌న్నా.. రావ‌ణ రాజ్య‌మే బెట‌ర్‌.. బీజేపీ నేత పోస్టు వైర‌ల్‌!
X
ఇప్పుడు దేశవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన వార్త పెరుగుతున్న‌ పెట్రో ధ‌ర‌లు. పెట్రో ధ‌ర‌ల నియంత్ర‌ణ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకున్న కేంద్ర ప్ర‌భుత్వం.. ఆ నిర్ణ‌యాన్ని అయిల్‌ కంపెనీల‌కు అప్ప‌గించ‌డంతో అవి ఇష్టారాజ్యంగా ధ‌ర‌లు పెంచుకుంటూ పోతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత పెరిగేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అగ్రిసెస్‌ను విధించ‌డంపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చివరకు.. బీజేపీకి చెందిన నేతలు సైతం ఈ ప్రతిపాదనలను త‌ప్పుబడుతున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్యం చేసిన ట్వీట్ తెగ వైర‌ల్ అవుతోంది.

శ్రీరామచంద్రుడు జన్మించిన భారత్‌లో పెట్రోల్ రేటు లీటర్ 93 రూపాయలు పలుకుతోందని, అదే సీతమ్మ తల్లి జన్మించిన నేపాల్‌లో కేవలం 53 రూపాయలేనని సుబ్రహ్యణ్య స్వామి పేర్కొన్నారు. ఇక‌, రావణాసురుడు ఏలిన శ్రీలంకలో పెట్రోల్ 51 రూపాయలకే దొరుకుతోందని రాశారు. అంతేకాదు.. ఇక రామరాజ్యం ఎక్కడ ఉన్నట్లు? అని ఆయన నెటిజన్లు ప్రశ్నించారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

పెట్రో ధరల పెరుగుదల వ‌ల్ల‌ క్షేత్రస్థాయిలో జ‌నం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు చేసిన‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. స్వామి వ్యాఖ్య‌ల‌ను కూడా ఉటంకిస్తూ.. ప్ర‌తిప‌క్షాలు బీజేపీ పాల‌నా తీరును తీవ్రంగా దునుమాడుతున్నాయి.

రామరాజ్యం క‌న్నా.. రావణుడు పరిపాలించిన లంక.. సీతమ్మ జన్మించిన నేపాల్ బెటర్ అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు పెట్రో ధ‌ర‌లు పెంచేశారని, ఇదెక్కడి రామరాజ్యం? అని పలువురు నెటిజన్లు ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌వ్నిస్తున్నారు. మ‌రి, కేంద్ర ప్ర‌భుత్వం ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటుందో?