Begin typing your search above and press return to search.

కదులుతున్న రైల్లోంచి దూకి అరుస్తున్న టీడీపీ

By:  Tupaki Desk   |   26 May 2018 11:05 AM GMT
కదులుతున్న రైల్లోంచి దూకి అరుస్తున్న టీడీపీ
X
టీడీపీ తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నిప్పులు చెరిగారు.. తెలుగు దేశం పార్టీ నాయకత్వం పాత స్నేహాన్ని మరిచిపోయిందని ఆయన ద్వజమెత్తారు.. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్ లో శనివారం ఏన్డీఏ నాలుగేళ్ల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ మాధవ్ చంద్రబాబు తీరును సభ సాక్షిగా ఎండగట్టారు. ఏపీ సీఎం కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దుష్ట చరిత్ర గల కాంగ్రెస్ తో జతకట్టి ఎన్టీఆర్ ఆశలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. అధర్మ రాజకీయాలు చేస్తూ ధర్మపోరాటం చేయడం ఏంటని నిలదీశారు. ఎవరిది ధర్మ పోరాటమో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచి పైకి రావడానికి కన్నా లక్ష్మీనారాయణకు మామ లేరని ఎద్దేవా చేశారు..

చంద్రబాబు తీరును రాంమాధవ్ ఉదాహరణలతో ఎండగట్టారు. అవినీతి చేసి దొరికినప్పుడు అందరూ ప్రజాసేవ అంటారని.. అవినీతి రహితం అంటూ మాట్లాడుతారని రాంమాధవ్ సెటైర్ వేశారు. టీడీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా నాలుగేళ్లపాటు స్వచ్ఛమైన పరిపాలన అందించామని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ నాయత్వంలో ఏపీలో నూతన ఒరవడి సృష్టిస్తామని స్పష్టం చేశారు.

తిరుమల వేంకటేశ్వర స్వామికి కూడా కులాన్ని అంటగట్టిన మహానుభావులు టీడీపీ వారని రాంమాధవ్ మండిపడ్డారు. 2014లో బీజేపీతో పొత్తుకారణంగానే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని రాంమాధవ్ స్ఫష్టం చేశారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ.. కదులుతున్న రైలు నుంచి దూకేసి గాయం తగిలిందంటూ మొసలికన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు కంటే కన్నా లక్ష్మీనారాయణకే అనుభవం ఎక్కువని పేర్కొన్నారు. పోలవరానికి వందశాతం నిధులు ఇస్తామని.. ఏపీ విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేరుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయన - ఇతర నేతలు సిద్ధార్థ నాథ్ సింగ్ - జీవీఎల్ నరసింహారావు - సోము వీర్రాజు నాయకులు పాల్గొన్నారు.