Begin typing your search above and press return to search.

రాష్ట్ర బీజేపీకి షాక్: జగన్ పాలనపై అధిష్టానం స్పందన

By:  Tupaki Desk   |   30 May 2020 3:30 AM GMT
రాష్ట్ర బీజేపీకి షాక్: జగన్ పాలనపై అధిష్టానం స్పందన
X
పొద్దున లేస్తే ఏపీ సీఎం జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా రాష్ట్ర బీజేపీ నేతలు.. చంద్రబాబు ఎజెండాలతో కలిసి వీరు విమర్శలు చేస్తుంటారనే విమర్శలున్నాయి. కానీ కేంద్రంలోని పాలిస్తున్న బీజేపీ అధిష్టానం మాత్రం జగన్ పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు షాకిస్తూ సీఎం జగన్ ఏడాది పాలనను ప్రశంసించడం విశేషం. దీంతో రాష్ట్ర బీజేపీ నేతల గొంతులో పచ్చివెలక్కాయపడ్డ చందంగా మారింది.

రాష్ట్రంలో జగన్, కేంద్రంలో మోడీ పాలన పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాంమాధవ్ మోడీకి, జగన్ కు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇద్దరూ ప్రజల కోసం పనిచేస్తున్నారని.. ఏపీ అభివృద్ధి పథంలో జగన్ ధృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని రాంమాధవ్ ప్రశంసించడం విశేషం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు పార్లమెంట్ లో వైసీపీ ప్రధాన మద్దతు లభిస్తోందని.. దీన్ని మోడీ సర్కార్ స్వాగతిస్తోందని రాంమాధవ్ పేర్కొన్నారు.

అంతేకాదు.. కేంద్రం ఏపీకి అన్ని రకాలుగా సాయం చేస్తుందని..రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతోపాటుగా వాటికి మించి ఏపీకి సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రధాని ఇప్పటికే చెప్పారని రాంమాధవ్ తెలిపారు.

ఏపీ బీజేపీ నాయకులు మాత్రం జగన్ తీరుపట్ల, ఏడాది పాలన పట్ల తీవ్ర విమర్శలు చేస్తూ ఆడిపోసుకుంటున్న తరుణంలో స్వయంగా బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం జగన్ ఏడాది పాలనను కొనియాడడం ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలకు మింగుడుపడని వ్యవహారంగా మారింది. ఈ విషయంలో ఒకే పార్టీ.. రెండు విధానాలు ఉండడంతో రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయాలకు విలువలేకుండా పోతోంది. లేదంటే చంద్రబాబు ప్రోద్బలంతో వీరు జగన్ కు యాంటీగా ప్రవర్తిస్తున్నారా అన్న అనుమానాలను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.